08-10-2025 08:14:15 PM
మేడిపల్లి (విజయక్రాంతి): గంజాయితో యాక్టివా బైకుపై అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం మేడిపల్లి పోలీస్ స్టేషన్ సిబ్బంది బుధవారం ఉదయం మేడిపల్లి ప్రశాంత్ నగర్ ఏరియాలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఇద్దరూ వ్యక్తులు నిర్మానుష్య ప్రాంతంలో యాక్టివాపై అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు వెళ్లి చూడగా వారి దగ్గర గంజాయి లభించింది. ఆ వ్యక్తులను పోలీస్ స్టేషన్ కు తరలించి విచారించగా ఘట్కేసర్ మండలం ఘనపూర్ కు చెందిన అన్న బోయిన కిరణ్ కుమార్(31), మేడిపల్లి క్రాంతి కాలనీకి చెందిన బక్కి నవీన్(26)గా తెలిపారు.
వారిని అదుపులోకి తీసుకొని వారి దగ్గర 65 గ్రాముల గంజాయి, ఒక యాక్టివా బైకు, సెల్ ఫోన్లు సీజ్ చేసి చట్ట ప్రకారం వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని మేడిపల్లి సీఐ గోవిందరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ... మత్తు పదార్థాలకు, గంజాయికి యువత దూరంగా ఉండాలని, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతామని, పోలీస్ స్టేషన్ పరిధిలో ఇప్పటికే బృందాలుగా ఏర్పడి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, డ్రగ్ రహిత సమాజం కోసం పాటుపడాలన్నదే తమ ధ్యేయమని, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాలు త్రాగే వారు, సేవించేవారు, విక్రయాలకు పాల్పడే వారి సమాచారాన్ని డయల్ 100 ద్వారా పోలీస్ వారికి అందించాలని కోరారు.