1 July, 2026 | 2:15 AM

అందనంత ఎత్తులో!

26-05-2024 12:05 AM

60 శాతం ప్రజలను విస్మరిస్తున్న బిల్డర్లు

10 శాతం ధనవంతులపైనే నిర్మాణ సంస్థల నజర్ 

2 వేల ఎస్‌ఎఫ్టీలతో ఆల్ట్రా లగ్జరీ నిర్మాణాలు

5 వేల ఎస్‌ఎఫ్టీలకు తగ్గకుండా ఊబర్ లగ్జరీ ప్లాట్స్

ఐటీ, ఎన్‌ఆర్‌ఐల పెట్టుబడులు తగ్గితే...

హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌పై తీవ్ర ప్రభావం

సామాన్యుల కోసం 750 ఎస్‌ఎఫ్‌టీలలో ప్లాట్లను నిర్మిస్తే మెజార్టీ ప్రజలకు తీరనున్న సొంతింటి కల సొంతిళ్లు ప్రతి పౌరుడి కల. ముఖ్యంగా దేశంలోనే ది బెస్ట్ లివబుల్ సిటీగా కీర్తి పొందుతున్న హైదరాబాద్‌లో సొంతిళ్లు/ప్లాటు కలను నెరవేర్చుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తారు. కానీ హైదరాబాద్ మహానగరంతో పాటు దేశంలోని అనేక మెట్రోనగరాల్లో కూడా మెజార్టీ ప్రజలు సొంతింటి కలను నెరవేర్చుకోలేని పరిస్థితి ఉంది. దేశంలో విస్తరిస్తున్న పట్టణీకరణ మూలంగా నగరాల్లో, ముఖ్యంగా మెట్రో నగరాల్లో భూముల/ ప్లాట్ల ధరలు మూడింతలు పెరిగాయి. అలాగే నగరాల్లో ఇండ్ల నిర్మాణం చేస్తున్న మెజార్టీ బిల్డర్లు సామాన్యులకు అందనంత ఎత్తులో కేవలం ఎన్‌ఆర్‌ఐ, ఐటీ, వ్యాపారస్తులను టార్గెట్ చేసుకొని నిర్మాణాలు చేపడుతున్నారు. కానీ పేద, మధ్యతరగతి కుటుంబాలను విస్మరిస్తున్నారు.

వాస్తవానికి నగరాల్లోని మొత్తం జనాభాలో సుమారు 30శాతం మందికి సొంతిండ్లు ఉన్నాయి. ఎన్‌ఆర్‌ఐ, ఐటీ, వ్యాపారులతో పాటు లక్షలల్లో వేతనాలు పొందుతున్న ఉద్యోగుల సంఖ్య నగరంలోని జనాభాలో 10శాతం ఉంటుంది.  మిగిలిన 60శాతం మంది మాత్రం సామాన్య, పేద, మధ్యతరగతి కుటుంబాలు. ఈ ప్రజలు అద్దె ఇండ్లలో ఉండలేక, పెరిగిన ధరలతో సొంతిళ్లు కొనుగోలు చేయలేక నానాయాతన పడుతున్నారు. కానీ నగరాల్లో ముఖ్యంగా హైదరాబాద్ మహా నగరంలోని మెజార్టీ బిల్డర్లు 10శాతం ఉన్న ఎన్‌ఆర్‌ఐలు, వ్యాపారవేత్తలు, ఐటీ కంపెనీల్లో ఉన్నతమైన పొజీషన్‌లో ఉన్నవాళ్లను టార్గెట్ చేసుకొని నిర్మాణాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా వేల కోట్ల పెట్టుబడులతో గేటెడ్ కమ్యునిటీలు, విల్లాలతో పాటు సామాన్యులకు అందనంత ఎత్తులో 2000 పైచిలుకు ఎస్‌ఎఫ్‌టీలతో ఆల్ట్రా లగ్జరీ ప్లాట్లను, 5000 పైచిలుకు ఎస్‌ఎఫ్‌టీలతో ఊబ ర్ లగ్జరీ ప్లాట్ల నిర్మాణాలపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. 

తక్కువ పెట్టుబడి.. ఎక్కువ ఆదాయం

హైదరాబాద్‌లోని పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు వెస్ట్, సౌత్, నార్త్ ప్రాంతాలలో ఎక్కువగా బహుళ అంతస్థులతో పాటు విశాలమైన, విలాసవంతమైన ప్లాట్లను నిర్మిస్తున్నాయి. వాస్తవానికి నగరంలో అపార్ట్‌మెంట్ కల్చర్ మొదలైనప్పుడు 750 నుంచి 850 ఎస్‌ఎఫ్‌టీలలో సింగిల్, డబుల్ బెడ్ రూం ప్లాట్లను నిర్మించేవారు. 1000 నుంచి 1200 ఎస్‌ఎఫ్‌టీల నుంచి క్రమంగా 1500 ఎస్‌ఎఫ్‌టీకు తగ్గకుండా మూడు బెడ్ రూంలు వచ్చేలా అపార్ట్‌మెంట్ ప్లాట్లను నిర్మిస్తున్నారు. కానీ వీటి నిర్మాణం నగరంలో 5శాతం కూడా జరగడం లేదు. 95శాతం మంది బిల్డర్లు అపార్టమెంట్లలో ప్లాట్లను 2000, 3000, 4000, 5000ల ఎస్‌ఎఫ్టీకు తగ్గకుండా నిర్మిస్తున్నారు. అంతేకాదు హైదరాబాద్‌లో ఓ బడా నిర్మాణ సంస్థ ఏకంగా 1600౦ ఎస్‌ఎఫ్టీలతో ప్లాట్లను నిర్మిస్తుంది. ఈ ప్లాట్ల ధరలు తక్కువలో తక్కువ రూ.2 కోట్ల నుంచి 10 కోట్ల వరకు ఉంటున్నాయి. వాస్తవానికి 750 నుంచి 1000 ఎస్‌ఎఫ్‌టీతో ప్లాట్లను నిర్మిస్తే నిర్మాణం వ్యయం పెరుగుతుంది. అలాగే 2000 పైచిలుకు ఎస్‌ఎఫ్టీతో చేసే నిర్మాణాల వ్యయం కొంత వరకు తగ్గడంతో పాటు తక్కువ సమయంలో ఎక్కువ ప్లాట్లను నిర్మించి ఎక్కువ మొత్తంలో ఆదాయం సమకూర్చుకోవచ్చని బిల్డర్లు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే తక్కువ విస్తీర్ణంలో ప్లాట్లను నిర్మించేందుకు బిల్డర్లు ఆసక్తి చూపకపోవడం వలన సామాన్యులకు ఇండిపెండెంట్ ఇండ్ల సంగతి పక్కన పెడితే అపార్ట్‌మెంట్‌లలో ప్లాట్లను కూడా కొనుగోలు చేసే పరిస్థితి లేకుండా పోయింది. 

గతంలో జనప్రియ వంటి నిర్మాణ సంస్థలు సామాన్యులకు అందుబాటులో ఉండేలా తక్కువ విస్తీర్ణంలో నిర్మాణాలతో కొన్ని వేల మంది పేద, మధ్య తరగతి ప్రజలకు సొంతింటి కలను నెరవేర్చాయి. కానీ ప్రస్తుతం నగరంలోని బిల్డర్లు మాత్రం చిన్న సైజ్ ప్లాట్ల జోలికి వెల్లడం లేదు.   

చిన్న ప్లాట్లతో రియల్ వృద్ది...

నగరంలో ప్రస్తుతం అద్దె ఇండ్లలో ఉంటున్న సుమారు 60 శాతం మంది ప్రజలను టార్గెట్ చేసుకొని బిల్డర్లు మళ్లీ 750 నుంచి 1200 లోపు ఎస్‌ఎఫ్టీలలో ప్లాట్లను నిర్మిస్తే ఒక్క ఏడాదిలోనే సుమారు 35 శాతం మంది ప్రజలు సొంతింటి కలను నెరవేర్చుకుంటారని రియల్ ఎస్టేట్ నిపుణులు పేర్కొంటున్నారు.  విలాసవంతమైన ప్లాట్లను సేల్ చేసేందుకు చాలా సమయం పడుతుందని, కానీ చిన్న చిన్న ప్లాట్లను చాలా సుల భంగా సేల్ చేయవచ్చని, దీంతో ఎక్కువ నిర్మాణాలను తక్కువ సమయంలో నిర్మించడంతో పాటు అతి తక్కువ సమయంలోనే ఎక్కువ ప్లాట్ల ను విక్రయించే అవకాశం ఉంటుందని రియల్ నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో నగరంలో రియల్ ఎస్టేట్ రంగం స్థిరమైన వృద్ధ్దిని నమోదు చేసుకుంటుందని వారు పేర్కొంటున్నారు.   

ఎన్‌ఆర్‌ఐ, ఐటీ పెట్టుబడులు తగ్గితే...

గత ఆరేడు నెలలుగా హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గింది. ఇదే పరిస్థితి ఇంకొన్నాళ్లు కొనసాగితే నగరంలో రియల్  ఎస్టేట్ రంగానికి గడ్డు పరిస్థితి తప్పదు. ప్రస్తుతం నగరంలో 2000, 5000 ఎస్‌ఎఫ్టీలతో నిర్మిస్తున్న ఆల్ట్రా, ఊబర్ లగ్జరీ ప్లాట్లను చాలా వరకు ఐటీ పరిశ్రమలలో టాప్ పొజీషన్‌లలో ఉన్నవాళ్లు, ఎన్‌ఆర్‌ఐలు కొనుగోలు చేస్తున్నారు. వీళ్ల వార్షిక ఆదాయం రూ. కోట్లలో ఉండటంతో సులభంగా మెట్రో నగరాల్లో ఖరీదైన ఇండ్లను కొనుగోలు చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన ఐటీ, ఎన్‌ఆర్‌ఐల ఉద్యోగాలకు ఎసరు వస్తుందట. ఆయా పరిశ్రమలు కోట్ల రూపాయలు అందుకుంటున్న ఉద్యోగులను క్రమంగా వదిలించుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై ఆదారపడుతున్నాయని ఐటీ ఉద్యోగులు పేర్కొంటున్నారు. నిజంగా ఇదే నగరంలో ప్రస్తుతం నిర్మించిన, నిర్మిస్తున్న లగ్జరీ ప్లాట్లు సేల్  కావడం అంత సులువైన పనేమీ కాదు. ప్రస్తుతం లగ్జరీ ప్లాట్లు కొనుగోలు చేసి ఉద్యోగాలు పోయిన వాళ్లు ఈఎంఐలు కట్టలేక ఇబ్బంది పడుతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. తద్వారా రియల్ ఎస్టేట్‌లో ఎన్‌ఆర్‌ఐ, ఐటీ ఉద్యోగుల పెట్టుబడులు తగ్గితే..  హైదరాబాద్ రియల్ ఎస్టే ట్ వ్యాపారంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే రూ.కోట్లలో ఇన్వెస్ట్ చేసేముందు ఐటీ, ఎన్‌ఆర్‌ఐలు చాలా సమయం తీసుకుంటారు. అనేక మంది ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే పెట్టుబడిపై ఒక నిర్ణయం తీసుకుంటారు. దీంతో సుమారు 6 నుంచి 12 నెలల సమయం పడుతుందని నిపుణులు చెప్తు న్నారు. ఈ ప్రభావం రియల్  రంగంపై తీవ్రంగా ఉంటుందని, ముఖ్యంగా రుణాలు తీసుకొచ్చి నిర్మాణాలు చేసే బిల్డర్‌పై తీవ్రంగా ఆర్థిక భారం పడుతుందని వాళ్లు పేర్కొంటున్నారు. 

 -బూడిద సుధాకర్, హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి