08-10-2025 07:35:22 PM
జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి
కాగజ్ నగర్ (విజయక్రాంతి): పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అధికారులకు అందిస్తున్న శిక్షణలో ప్రతి అంశంపై అవగాహన పొందాలని జిల్లా అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) దీపక్ తివారి అన్నారు. బుధవారం కాగజ్ నగర్ మండల కేంద్రంలో ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమానికి సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లాతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సాధారణ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఎలాంటి పొరపాట్లు లేకుండా సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు శిక్షణలో నేర్చుకున్న అంశాలను ఎన్నికల నిబంధనలకు లోబడి ఖచ్చితంగా పాటించాలని తెలిపారు.
ఎన్నికల నిర్వహణ, ఓటింగ్ ప్రక్రియ, విధులు, బాధ్యతలు, తీసుకోవలసిన జాగ్రత్తలు ప్రతి అంశంపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. జిల్లాలో 2 విడతలలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు 2 విడతలలో ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని, ఎన్నికల ప్రవర్తన నియమావళి నిబంధనలను అధికారుల సమన్వయంతో పకడ్బందీగా అమలు చేయాలని తెలిపారు. మొదటి విడతలో 8 జడ్పీటీసీ, 71 ఎంపీటీసీ స్థానాలకు, రెండవ విడతలో 7 జడ్పీటీసీ, 56 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.