calender_icon.png 8 October, 2025 | 10:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పత్తి కొనుగోలుకు ఏర్పాట్లు చేపట్టాలి

08-10-2025 07:31:08 PM

జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే..

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లాలో పత్తి కొనుగోలు ప్రక్రియ కొరకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. బుధవారం కలెక్టరేట్ లో జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్ రావులతో కలిసి సి.సి.ఐ, మార్కెటింగ్, పోలీస్, రెవెన్యూ, వ్యవసాయ, తూనికలు కొలతలు, విద్యుత్, అగ్నిమాపక శాఖల అధికారులు, జిన్నింగ్ మిల్లుల యజమానులతో పత్తి కొనుగోలు ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ సంవత్సరం 3 లక్షల 34 ఎకరాలలో పత్తి పంట సాగు జరుగుతుందని, 38 లక్షల క్వింటాళ్ల పత్తి పంట దిగుబడి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని, కేంద్ర ప్రభుత్వం పత్తి పంటకు 8 వేల 110 రూపాయల మద్దతు ధరను ప్రకటించిందని తెలిపారు. రైతులు కిసాన్ కపాస్ యాప్ ద్వారా పత్తి పంటను విక్రయించుకునేందుకు స్లాట్ బుక్ చేసుకోవలసి ఉందని, వ్యవసాయ శాఖ అధికారులు ప్రతి రైతుకు యాప్ వినియోగం, స్లాట్ బుకింగ్ పై అవగాహన కల్పించాలని తెలిపారు.

జిల్లాలో నవంబర్ మొదటి వారంలో పత్తి కొనుగోలు చేపట్టడం జరుగుతుందని, జిన్నింగ్ మిల్లులలో ఏమైనా మరమ్మత్తులు ఉన్నట్లయితే సమయంలోగా పూర్తి చేసుకుని కొనుగోలుకు సిద్ధంగా ఉంచాలని తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులు నాణ్యమైన విద్యుత్ అందించాలని, జిన్నింగ్ మిల్లులలో ఎలాంటి అగ్ని ప్రమాదాలకు అవకాశం లేకుండా అగ్నిమాపక శాఖ తనిఖీలు నిర్వహించాలని తెలిపారు. తూనికలు కొలతల శాఖ అధికారులు జిన్నింగ్ మిల్లులలో ఎలక్ట్రానిక్ తూకాన్ని తనిఖీ చేయాలని, పత్తి నిల్వలు పేరుకుపోకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిన్నింగ్ మిల్లులలో రైతులకు అవసరమైన త్రాగునీరు, నీడ కల్పించాలని, జిల్లాలో 24 జిన్నింగ్ మిల్లుల ద్వారా పత్తి కొనుగోలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. రైతులు దళారులకు విక్రయించకుండా సి.సి.ఐ. కేంద్రాలలో విక్రయించి కనీస మద్దతు ధర పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ అధికారి అశ్వక్ అహ్మద్, జిల్లా వ్యవసాయ అధికారి వెంకటి, విద్యుత్ శాఖ ఎస్. ఈ. శేషరావు, జిల్లా రవాణా శాఖ అధికారి రామ్ చందర్, సంబంధిత శాఖల అధికారులు, సి.సి.ఐ. అధికారులు, జిన్నింగ్ మిల్లుల యజమానులు తదితరులు పాల్గొన్నారు.