30-08-2025 06:31:49 PM
నకిరేకల్ (విజయక్రాంతి): మత్తడి నుండి వచ్చే కట్టు కాలువకు మరమ్మత్తులు చేపట్టినట్లయితే కడపర్తి చెరువు నిండుతుందని సిపిఎం మండల కమిటీ సభ్యులు ఆకుల భాస్కర్(CPM Mandal Committee Member Akula Bhaskar) పేర్కొన్నారు. శనివారం మండలంలోని కడపర్తి గ్రామంలో సిపిఎం ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా పలు వార్డులలో పర్యటించి గ్రామ ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మత్తడి నుండి వచ్చే కట్టు కాలువ ద్వారానే కడపర్తి చెరువు నిండుతుందన్నారు. కానీ ఇటీవల కాలంలో కట్టు కాలువ తెగిపోవడంతో వరద నీరంతా ఇతర గ్రామాల చెరువులోకి పోతుందన్నారు. దీనివల్ల కడపర్తి గ్రామ ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి కట్టు కాలువకు మరమ్మతులు చేపట్టి కడపర్తి చెరువు నిండే విధంగా చూడాలన్నారు. బస్టాండ్ నుండి శివాలయం కు వెళ్లే దారిని సీసీ రోడ్డుగా నిర్మించి సైడు డ్రైనేజీ ఏర్పాటు చేయాలన్నారు నకిరేకల్ నుండి కడపర్తికి వచ్చే దారిలో జాతర భాగవతం ఉన్న కల్వర్టు స్థానంలో లో లెవెల్ బ్రిడ్జిని నిర్మాణం చేయాలని కోరారు. గ్రామంలో నెలకొని ఉన్న సమస్యలతో పాటు అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు పింఛన్లు ఇవ్వాలని కోరుతూ గ్రామ కార్యదర్శి కి వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో శాఖ కార్యదర్శి రామచంద్రయ్య, భూపతి వెంకన్న, గుండ్లపల్లి శేఖర్, బెల్లి వెంకన్న, పరమప్ప, టి సైదులు,బెల్లి శంకర్ మాద రమేష్ ,శ్రీను, మంటిపల్లి లింగయ్య పాల్గొన్నారు.