30-08-2025 06:33:56 PM
గణనాథుల వద్ద ప్రత్యేక పూజలు
కరీంనగర్ క్రైం,(విజయక్రాంతి): వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని కరీంనగర్ టవర్ సర్కిల్ గణనాథుడి వద్ద శనివారం తిలక్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు ముఖ్య అతిథిగా హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాజేందర్ రావు భక్తులు, మహిళలకు దగ్గరుండి భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా భక్తులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. గణనాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అంతకుముందు సవరన్ స్ట్రీట్ లోని గణనాథుడి వద్ద రాజేందర్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కిసాన్ నగర్, అంబేద్కర్ నగర్లో పలు వినాయక విగ్రహాల వద్ద రాజేందర్ రావు ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా రాజేందర్ రావ్ మాట్లాడుతూ విఘ్నేశ్వరుడి కృప వల్ల కరీంనగర్ ప్రజలు సుఖ సంతోషాలతో విలసిల్లాలని, ఇబ్బందులు రాకుండా చూడాలని స్వామివారిని వేడుకున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ప్రజలంతా ఆనందంగా జీవించాలని వినాయకుని కోరుకున్నట్లు తెలిపారు.
వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రసాదం పంపిణీ..
కరీంనగర్ లోని మార్కెట్ సమీపంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు శనివారం ప్రసాదం పంపిణీ చేశారు. అంతకు ముందు ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు రాజేంద్ర రావు పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులందరికీ రాజేందర్ రావు ప్రసాధం పంపిణీ చేశారు.
నేనున్నా మీకోసం..
కరీంనగర్ ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా అందుబాటులో ఉంటానని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. బుధవారం కిసాన్ నగర్ లోని పలు గల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా రోడ్డు సమస్యతో ఇబ్బంది పడుతున్న ప్రజలతో మాట్లాడారు. రోడ్డు నిర్మాణానికి అధికారులతో మాట్లాడి సత్వరమే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా చూస్తానని, అందుబాటులో ఉండి రోడ్డు నిర్మాణాన్ని తక్షణమే జరిపిస్తానని రాజేందర్ భరోసా కల్పించారు. కరీంనగర్ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఏ సమస్య వచ్చినా ముందుండి పరిష్కరిస్తామని రాజేందర్ రావు పేర్కొన్నారు.