25-10-2025 03:43:38 PM
బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్
బెల్లంపల్లి,(విజయక్రాంతి): సింగరేణి సి అండ్ ఎండి సహకారంతో ఈనెల 26న బెల్లంపల్లి ఏఎంసి నెంబర్ 2 గ్రౌండ్ లో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాను నిరుద్యోగ అభ్యర్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కోరారు. శనివారం బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శని వారం ఉదయం వరకు 5,067 మంది క్యూఆర్ కోడ్ ద్వారా జాబ్ మేళా కోసం తమ వివరాలను నమోదు చేసుకోవడం అభినందనీయమన్నారు.
మందమర్రి సింగరేణి జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ మాట్లాడుతూ 70 రకాల ఫార్మా, ఐటీ, బ్యాంకింగ్ కంపెనీలు ఈ మేళాలో పాల్గొననున్నట్లు తెలిపారు. సింగరేణి సి ఎస్ ఆర్ నిధుల కింద ఈ మేళాను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు ఐదు వేల మందికి పైగా క్యూఆర్ కోడ్ ద్వారా వివరాలు నమోదు చేసుకున్నట్లు చెప్పారు. జాబ్ మేళాలో సుమారుగా 8 వేల మంది వరకు నిరుద్యోగ అభ్యర్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. హాజరయ్యే నిరుద్యోగులతో పాటు నిర్వాహకులకు భోజన వసతి, త్రాగునీటి సదుపాయం కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఏడవ తరగతి నుండి పీజీ వరకు అర్హులైన నిరుద్యోగులు అందరికీ ఉద్యోగ అవకాశాలను కల్పించి వారి కుటుంబాలను ఆదుకోవాలని ఉద్దేశంతో సింగరేణి సంస్థ ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు.
అభ్యర్థుల క్వాలిఫికేషన్ ప్రకారం ఇంటర్వ్యూలలో అర్హత సాధించిన వారికి వెంటనే నియామక ఉత్తర్వులు అందించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, ఏసీపి ఏ రవి కుమార్, మందమర్రి ఏరియా ఎస్ ఓ టు జిఎం విజయ్ ప్రసాద్, పర్సనల్ మేనేజర్ ఎస్. శ్యాంసుందర్, సెక్యూరిటీ ఆఫీసర్ రవీందర్, నోబెల్ ఎంపవర్మెంట్ ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రాజెక్ట్ మేనేజర్ గోగర్ల శోభన్ బాబు, సొసైటీ సమన్వయకర్త తాళ్లపల్లి అశోక్, బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ముచ్చర్ల మల్లయ్య, సీనియర్ నాయకులు మునిమంద రమేష్, నాయకులు దావ రమేష్ లతోపాటు పలువురు పాల్గొన్నారు.
ఏర్పాట్లు పూర్తి...
బెల్లంపల్లి ఏఎంసి నెంబర్ 2 గ్రౌండ్ లో జాబ్ మేళా కోసం సింగరేణి యాజమాన్యం, ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. సింగరేణి ఈ ప్రాంతంలో మొట్టమొదటిసారి ఇంత పెద్ద ఎత్తున జాబ్ మేళా నిర్వహించి విజయవంతం చేసేందుకు కృషి చేయడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. నియోజకవర్గంలోని పలు మండలాల నుండి దాదాపు పదివేల వరకు నిరుద్యోగ అభ్యర్థులు ఉద్యోగాల కోసం పోటీపడేందుకు పాల్గొని అవకాశాలున్నాయి.
దీనిని దృష్టిలో పెట్టుకొని ఏఎంసి నెంబర్ 2 గ్రౌండ్ లో సింగరేణి యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేపట్టింది. దరఖాస్తులు సమర్పించేందుకు ప్రత్యేకమైన స్టాళ్లను ఏర్పాటు చేస్తుంది. ఎండ వేడిమిని దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా టెంట్లు ఏర్పాటు చేసింది. జాబ్ మేళా కోసం చేపడుతున్న ఏర్పాట్లను మందమర్రి సింగరేణి ఏరియా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
జాబ్ మేళాకు ప్రత్యేక అతిథులు వీరే
ఆదివారం బెల్లంపల్లి ఏఎంసి నెంబర్ 2 గ్రౌండ్ లో సింగరేణి సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న మెగా జాబ్ మేళా కార్యక్రమానికి సింగరేణి ప్రాజెక్టు అండ్ ప్లానింగ్ (డైరెక్టర్) కె వెంకటేశ్వర్లు ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారు. అదేవిధంగా నోబెల్ ఎంపవర్మెంట్ ఎడ్యుకేషనల్ సొసైటీ మేనేజింగ్ డైరెక్టర్ డి. సురేష్ కుమార్ లు హాజరై ఈ మెగా జాబ్ మేళా కు దిశా నిర్దేశం చేయనున్నారు. స్థానిక బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ సహకారంతో సింగరేణి యాజమాన్యం, నోబెల్ ఎంపవర్మెంట్ ఎడ్యుకేషనల్ సొసైటీ పెద్ద ఎత్తున బెల్లంపల్లి ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ ,ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ముందుకు రావడం పట్ల సర్వత్ర హర్షం వ్యక్తమవుతుంది.