calender_icon.png 26 October, 2025 | 5:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒంటరి మహిళల బంగారు ఆభరణాలే టార్గెట్..

25-10-2025 07:02:14 PM

- సమీప మండలాలు ఎంచుకున్న మునుగోడు మొనగాడు

- ఏడు చోరీలలో 9.5 తులాల బంగారం,రెండు సైకిల్ మోటార్ల స్వాధీనం

- గతంలో నిందితునిపై చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదు

- నిందితుని వివరాలను వెల్లడించిన డి.ఎస్.పి.కె శివరాం రెడ్డి

మునుగోడు (విజయక్రాంతి): ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ వారి మెడలో బంగారు పుస్తేల తాళ్లను ఎత్తుకెళ్తు, బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్ట్ చేసి నార్కట్పల్లి పోలీస్ స్టేషన్ నుండి మీడియాకు నల్లగొండ డి.ఎస్.పి కె. శివరాం రెడ్డి వివరాలను వెల్లడించారు. వరుస ఏడు చోరీలలో నిందితుని వద్ద నుండి 15 లక్షల విలువ గల 9.5 తులాల బంగారు ఆభరణాలు, 2 మోటారు సైకిళ్ళను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. డీఎస్పీ తెలిపిన నిందితుని వివరాల ప్రకారం నల్గొండ జిల్లా మునుగోడు మండలం పులిపలుపుల గ్రామానికి చెందిన బొలుగూరి శివ తండ్రి వెంకన్న, వయస్సు: 24 సంవత్సరాలు, వృత్తి ఆటో డ్రైవర్ గా గుర్తించారు.

ఈనెల 18వ తేదీన నార్కెట్ పల్లి మండలం దాసరిగూడెం గ్రామానికి చెందిన ఉప్పుల సునీత ఉదయం 10 గంటల సమయంలో తన పత్తి చేనులో పని చేసుకుంటూ ఉండగ ఆమె దగ్గరికి ఒక గుర్తు తెలియని వ్యక్తి బైక్ పై వచ్చి ఆమెను మాటల్లో పెట్టి, మెడలో ఉన్న 03 తులాల పుస్తెల తాడును లాక్కొని వెళ్లడానికి  ప్రయత్నిస్తుండగా బాధితురాలు గట్టిగా అరుస్తూ అతనిని పట్టుకొనే ప్రయత్నం చేస్తున్న సమయంలో అటుగా వెళ్తున్న పొలగాని సైదులు,ఉప్పుల మోహన్ రెడ్డి లు అతనిని పట్టుకొని పోలీసులకు సమాచారం అందుంచడంతో వెంటనే  నార్కట్ పల్లి పోలీసులు అక్కడకి చేరుకొని అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

జరిగిన సంఘటనపై నార్కెట్ పల్లి పోలీసు స్టేషన్ లో బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐ‌పి‌ఎస్ ఆదేశాల మేరకు డి.ఎస్.పి కె. శివరాం రెడ్డి పర్యవేక్షణలో, నార్కెట్ పల్లి సి ఐ కె. నాగరాజు, ఎస్‌ఐ డి.క్రాంతి కుమార్ వారి సిబ్బంది సమగ్ర విచారణ చేపట్టి ప్రస్తుతం కేసుతో పాటు ఏడు (5 స్నాచింగ్, 2 బైక్ దొంగతనం) దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు. నిందితుడిని  విచారించగా నేరస్తుడు, చెడు వ్యసనాలకు బానిసగా, జులయిగా తిరుగుతూ తాను దొంగిలించిన రెండు మోటార్ సైకిళ్ళ లను ఉపయోగించి ఒంటరిగా వెళ్ళే మహిళలనే టార్గెట్ చేస్తూ వారితో మాటలు కలిపి వారి మెడలో ఉన్న బంగారం పుస్తేల తాడు,గొలుసులు లాక్కొని బైక్ పై పారిపోయేవాడని అన్నారు. నిందితునిపై చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ లో పోక్సో కేసు నమోదైనది తెలిపారు. సమగ్ర విచారణ చేపట్టి నిందితుని వద్ద నుండి బంగారు ఆభరణాలు రికవరీ చేసిన నార్కెట్ పల్లి ఎస్‌.ఐ, డి. క్రాంతి కుమార్, ఆంజనేయులు, జవహర్, బి.రమేష్, జానీ పాషా, సత్యనారాయణ, బండి గిరి బాబు, శ్రీ క్రిష్ణ, సురేష్ గౌడ్ లను నల్లగొండ ఎస్పీ అభినందించారు.