11-09-2025 10:56:01 PM
కొండపాక: సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ లో కీలక పాత్ర పోషిస్తాయని, నేరస్తులను పట్టుకోవడం సులభతరం అవుతుందని సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ(CP Anuradha) అన్నారు. కొండపాక మండలం దుద్దెడలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సిద్దిపేట కమిషనర్ ఆఫ్ పోలీస్ అనురాధ మాట్లాడుతూ సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను అరికట్టవచ్చన్నారు. నేరరహిత సమాజానికి సీసీ కెమెరాలు చాలా ముఖ్యమన్నారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని పేర్కొన్నారు. ప్రజలకు భద్రత, సెన్సాఫ్ సెక్యూరిటీ కలిగించడంలో సీసీ కెమెరాలు చాలా ముఖ్యమని పేర్కొన్నారు. దుద్దెడ గ్రామంలో రాజీవ్ రహదారి ఎంట్రీ, ఎగ్జిట్, గ్రామంలోని ముఖ్యమైన చౌరస్తాలలో 30 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. సీసీ కెమెరాలు 24 గంటల నిరంతరం పనిచేస్తాయని తెలిపారు. జిల్లాలో నేరాల అదుపు చేయడానికి పోలీసులతో పాటు గ్రామ పెద్దలు గ్రామ ప్రజా ప్రతినిధులు వ్యాపారస్తులు భాగస్వామ్యం చేయడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.
సీసీ కెమెరాలు ఉన్న ఇండ్లలో కాలనీలలో గ్రామాలలో నేరస్తులు నేరం చేయడానికి భయపడతారని తెలిపారు. ప్రశాంతంగా ఉంటుందన్నారు. ప్రస్తుతం అధునాతన టెక్నాలజీ అందుబాటులో ఉన్నందున ప్రతి ఒక్కరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అందుకు గ్రామస్తులు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని సూచించారు. సిద్దిపేట జిల్లాలో సీసీ కెమెరాలు ఉండి పనిచేయని సిసి కెమెరాలు విషయంలో నూతన సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు ప్రజాప్రతినిధులు వ్యాపారస్తులు పోలీస్ శాఖకు సహకరించాలని సూచించారు. గ్రామాలలో పట్టణాలలో ఎవరైనా అనుమానాస్పదంగా కనబడితే వెంటనే డయల్ 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు జియోట్యాగింగ్ ద్వారా సిద్దిపేట కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానం చేసిన తర్వాత హైదరాబాద్ కమాండ్ కంట్రోల్స్ సెంటర్ కు అనుసంధానం చేయడం జరుగుతుందన్నారు.
కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా షాపుల యజమానులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని ఒక కెమెరా రోడ్డు వైపు పెట్టుకోవాలని సూచించారు. సీసీ కెమెరాలు పెట్టడంతో పాటు అవి పని చేసే విధంగా ప్రతిరోజు మానిటర్ చేయడం చాలా ముఖ్యమని తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన మాజీ సర్పంచ్ ఆరేపల్లి మహదేవ్ గౌడ్, రమేష్, మంచాల శ్రీనివాస్ ఆరేపల్లి శ్రీనివాస్, నాగప్రసాద్, శివకుమార్, ఆంజనేయులు, సహకరించిన దాతలు అందరిని అభినందించి శాలువతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి, త్రీ టౌన్ సి ఐ విద్యాసాగర్, ఎస్ఐ చంద్రయ్య, గ్రామ ప్రజలు వ్యాపారస్తులు ప్రజాప్రతినిధులు, గ్రామ మహిళా సంఘాల మహిళా ప్రతినిధులు, స్కూల్ విద్యార్థులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.