11-09-2025 10:52:02 PM
ప్రమాదాల బారిన వాహనాలు
రామచంద్రపురం దుస్థితిపై స్పందించిన అధికారులు
రామచంద్రపురం: సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం తహసీల్దార్ కార్యాలయం ముందు, గీత భూపాల్ రెడ్డి జూనియర్ కళాశాల సమీపంలోని రహదారిలో వర్షం పడ్డ ప్రతిసారి సముద్రంలా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులకు ఎన్నిసార్లు పిర్యాదు చేసిన చూడనట్లు వుంటున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గురువారం సాయంత్రం కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. చిన్న వాన పడితేనే రహదారిపై నీరు నిలిచిపోతుంది. కాలేజీకి వెళ్ళే విద్యార్థులు, ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలు మురికి నీటిలోనూ, చిత్తడిలోనూ నడవాల్సి వస్తోంది. ముఖ్యంగా కాలినడకన వెళ్లేవారు ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు.
ప్రమాదాల బారిన వాహనదారులు..
వర్షపు నీటిలో వాహనాలు వేగంగా వెళ్లడం వల్ల రోడ్డు పక్కన నడుస్తున్న ప్రజలు నీళ్లలో మునిగిపోతూ, ప్రమాదాలకు గురవుతున్నారు. ఇంత ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు ఉన్న ప్రాంతంలోనే ఈ దుస్థితి ఉండటం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు..
కాలేజీ, పాఠశాలకు వెళ్లే చిన్నారులు తల్లిదండ్రుల సహాయంతోనే బురద నీటిని దాటి వెళ్లాల్సి వస్తోంది. ఇది ఆరోగ్య సమస్యలకు కూడా కారణం అవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయం ముందు ఇలాంటి పరిస్థితి ఉంటే మేము ఎవరిని ఆశ్రయించాలి? ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు అని కాలనీ వాసులు వాపోతున్నారు.