12-08-2025 04:57:07 PM
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన మంగళవారం కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. ప్రభుత్వం నాలుగు కొత్త సెమీకండక్టర్ ప్రాజెక్టులను ఆమోదించిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రూ.4594 కోట్ల పెట్టుబడితో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పంజాబ్ లో నాలుగు సెమీ కండక్టర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు ఆమోదించింది. ఇలాంటి ఆరు ప్రాజెక్టులకు గతంలో ఆమోదం లభించింది. లక్నో మెట్రో రైలు ప్రాజెక్టు ఫేజ్-1బికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.5,801 కోట్ల పెట్టుబడితో లక్నో మెట్రో రైలు ప్రాజెక్టు ఫేజ్-1బి 11.165 కి.మీల పొడవున 12 స్టేషన్లు నిర్మించనున్నారు.
గత మూడు కేంద్ర మంత్రివర్గ సమావేశాల నిర్ణయాలు
1). ఆగస్టు 8న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ ఐదు ప్రధాన నిర్ణయాలు తీసుకున్నామని, మొత్తం రూ.52,667 కోట్ల ఆమోదాలు వచ్చాయని చెప్పారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన సబ్సిడీ 2025–26లో కూడా కొనసాగుతుందని, దీనికి రూ.12,060 కోట్లు కేటాయించామని పేర్కొన్నారు.
దేశీయ ఎల్పీజీపై నష్టాలను భర్తీ చేయడానికి ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు రూ.30,000 కోట్లు అందుకుంటాయి. సాంకేతిక విద్యను మెరుగుపరచడానికి మెరైట్ పథకానికి (MERITE Scheme) రూ.4,200 కోట్లు లభిస్తాయి. అస్సాం, త్రిపుర కోసం ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద రూ.4,250 కోట్ల విలువైన నాలుగు కొత్త ప్రాజెక్టులకు అనుమతి లభించింది. తమిళనాడులోని మరక్కనం- పుదుచ్చేరి మధ్య 46 కి.మీ., నాలుగు లేన్ల రహదారిని రూ.2,157 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు.
2). జూలై 31న ప్రధానమంత్రి అధ్యక్షత వహించిన సమావేశంలో ఆరు ప్రధాన ఆమోదాలు లభించాయి. రెండు నిర్ణయాలు రైతులు, ఆహార రంగంపై దృష్టి సారించగా, నాలుగు నిర్ణయాలు ఈశాన్యంలో రైల్వే నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టినట్లు వెల్లడించారు.
3). జూలై 16న కేంద్ర కేబినెట్ ప్రధానమంత్రి ధన్-ధన్య వ్యవసాయ పథకాన్ని ఆమోదించింది. దీనిని మొదటిసారిగా ఫిబ్రవరి 1, 2025న కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించారు. ఈ పథకం 2025–26లో ప్రారంభమై ఆరు సంవత్సరాల పాటు కొనసాగుతుంది. తక్కువ వ్యవసాయ ఉత్పత్తి ఉన్న 100 జిల్లాలను లక్ష్యంగా చేసుకొని, ఉత్పత్తిని పెంచడం, పంటలను వైవిధ్యపరచడం, స్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, నిల్వను మెరుగుపరచడం, సరసమైన రుణాలను అందించడం ద్వారా 1.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూర్చడం దీని లక్ష్యం.