12-08-2025 10:43:34 PM
జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే..
కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే(District Collector Venkatesh Dhotre) అన్నారు.. మంగళవారం ఆసిఫాబాద్ మండలం అడ గ్రామపంచాయతీ పరిధిలోని వాడి గూడ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి తరగతి గదులు, వంటశాల, రిజిస్టర్లు, పాఠశాల పరిసరాలను పరిశీలించి విద్యార్థుల అభ్యాసన సామర్ధ్యాన్ని పరీక్షించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రభుత్వ విద్య సంస్థలను బలోపేతం చేసి విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
విద్యార్థులకు విద్యతో పాటు మెనూ ప్రకారం పోషక విలువలు కలిగిన రుచికరమైన ఆహారాన్ని అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాల పరిధిలోని విద్యార్థులు ప్రతి రోజు పాఠశాలకు హాజరు కావాలని, బడి బయట పిల్లలు, మధ్యలో బడి మానివేసిన పిల్లలను గుర్తించి తిరిగి పాఠశాలకు వచ్చే విధంగా వారి తల్లిదండ్రులకు విద్య ఆవశ్యకతను వివరించాలని తెలిపారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, మధ్యాహ్న భోజనం తయారు చేసే గది శుభ్రంగా ఉంచాలని, వంట తయారీలో తాజా కూరగాయలు, నాణ్యమైన నిత్యవసర సరుకులను వినియోగించాలని, వంట చేసేవారు శుభ్రత పాటించాలని తెలిపారు. విద్యార్థులకు శుద్ధమైన త్రాగునీటిని అందించాలని, విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని, తరగతిలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాధికారి ఉదయ్ బాబు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.