12-08-2025 10:47:47 PM
అన్ని శాఖల అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి..
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు, నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి..
వనపర్తి టౌన్: రానున్న 72 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి(District Collector Adarsh Surabhi) ఆదేశించారు. మంగళవారం ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సహచర మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన అప్రమత్త చర్యలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, అన్ని శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశానికి వనపర్తి జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో పాటు, ఎస్పీ గిరిధర్ రావుల, అదనపు కలెక్టర్ రెవెన్యూ కీమ్యా నాయక్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.
అనంతరం కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ రాబోయే 72 గంటల్లో భారీ వర్షాలు సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసిన నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు, నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్ అధికారులు కూడా వర్షాల సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. జిల్లాలో ఎక్కడెక్కడ ఓవర్ ఫ్లో అయ్యే బ్రిడ్జిలు కల్వర్టులు గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులకు కలెక్టర్ సూచించారు. జిల్లాలో శిథిలావస్థలో ఉన్న భవనాలు, ప్రమాదకరంగా ఉన్న బ్రిడ్జిలు, కల్వర్టులను గుర్తించి అక్కడ ప్రజలు ప్రమాదంలో పడకుండా అప్రమత్తం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. వైద్యశాఖ అధికారులు కూడా అత్యవసర సమయంలో ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.