12-08-2025 11:50:26 PM
ఈ మేరకు ఒప్పందం కుదరింది..
కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం..
హైదరాబాద్ (విజయక్రాంతి): బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేసే విషయమై రెండు పార్టీల మధ్య ఒప్పందం జరిగిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం(Congress MLA Medipally Sathyam) ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్టు చెప్పారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, బీఆర్‌ఎస్ హయంలో ప్రజా సమస్యల కోసం వేదికలు ఉండేవి కావన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ హయాంలోని గడీల పాలన, ఫాంహౌస్ పాలనకు చరమగీతం పాడి ప్రజా పాలన వచ్చిందని తెలిపారు. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి అందుబాటులో ప్రజాప్రతినిధులు అనే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేపట్టిందన్నారు.
గాంధీభవన్‌కు నిత్యం వందలాది మంది తమ సమస్యలను పరిష్కరించాలని వస్తున్నారని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. సామాజిక న్యాయం కోసం ఎస్సీ వర్గీకరణ, కులగణన చేపట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి, సీఎం రేవంత్‌రెడ్డికి మంచి పేరు వస్తోందనే అక్కసుతో బీజేపీ నాయకులు బీసీ బిల్లును అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. బీసీల విషయంలో బీఆర్‌ఎస్ బీజేపీ పక్షాన ఉంటుందా? కాంగ్రెస్ పక్షం వైపు ఉంటుందో తేల్చుకోవాలని ఆయన సవాల్ విసిరారు.