12-08-2025 11:44:25 PM
ఆర్టీఐ సమాచారం ద్వారా బెదిరింపులు
డబ్బు ఇవ్వకుంటే యూట్యూబ్ చానెళ్లలో కథనాలు
బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
హైదరాబాద్ (విజయక్రాంతి): ‘అక్రమ సంపాదనతో సీఎం రేవంత్‌రెడ్డి రాజకీయాలు చేస్తున్నారు. ఆర్టీఏ ద్వారా సమాచారం సేకరించి, కొందర్ని బెదిరిస్తున్నారు. తద్వారా డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నారు. డబ్బు ఇవ్వకుంటే సీఎం కొన్ని యూట్యూబ్ చానెళ్లలో వ్యతిరేకమైన కథనాలు ప్రసారం చేయిస్తున్నారని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు(Former MLA Guvvala Balaraju) ఆరోపించారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్ హయాంలో నాటి ప్రభుత్వ పెద్దలు అవలంబించిన విధానాలనే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అమలు చేస్తున్నదని ఆరోపించారు. ప్రజా ఉద్యమాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుతో పాటు తమ పార్టీ నేతల అరెస్టును ఖండిస్తున్నామని ప్రకటించారు.
హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న బంజారాహిల్స్ పెద్దమ్మతల్లి ఆలయంలో హిందూ సంఘాలు నిర్వహిస్తున్న కుంకుమార్చనకు వెళ్లే నేతలను ఎందుకు అరెస్ట్ చేశారని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని వేషాలు వేసినా, జూబ్లీహిల్స్ ప్రజలు ఉప ఎన్నికల్లో బీజేపీ వైపునే నిలబడతారని జోస్యం చెప్పారు. రాంచందర్‌రావును అడ్డుకునేందుకు కొందరు పరోక్షంగా కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ‘ఓటు చోరీ’ అంటూ గగ్గోలు పెడుతున్న ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి.. తమ పార్టీ గెలిచిన రాష్ట్రాల్లో ఓట్ల గల్లంతుపై వస్తున్న ఆరోపణలను ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు.