12-08-2025 10:40:54 PM
జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లాలోని వ్యవసాయ, స్వయం సహాయక సంఘాలు ఇతర రంగాల అభివృద్ధిలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు రుణ సదుపాయం కల్పించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే(District Collector Venkatesh Dhotre) అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎ. జి. ఎం. చేతన్ గోరేకర్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ రాజేశ్వర్ జోషి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారావులతో కలిసి వివిధ శాఖల అధికారులతో జిల్లా స్థాయి త్రైమాసిక కమిటీ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, బ్యాంకర్లు అర్హులైన లబ్ధిదారులకు రుణ సదుపాయం కల్పించి అభివృద్ధికి తోడ్పడాలని తెలిపారు. వ్యవసాయ రైతులకు ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం రుణాలు అందించాలని, స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ ప్రక్రియ పూర్తి చేసి నూతన రుణాలు అందించాలని తెలిపారు.
ప్రధానమంత్రి విశ్వకర్మ పథకంలో శిక్షణ పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరికి రుణాలు అందించాలని, చిన్న చిన్న కారణాలతో దరఖాస్తులను తిరస్కరించకూడదని, అభ్యర్థులకు సమాచారం అందించి అవసరమైన పత్రాలను తీసుకొని రుణ మంజూరు జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గిరిజన సంక్షేమ, షెడ్యూల్డ్ కులాల సంక్షేమ రుణాలు అర్హులకు అందించాలని, రుణ మంజూరులో బ్యాంకులు జాప్యం చేయకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాబార్డు డి. డి. ఎం. వీరభద్రుడు, తెలంగాణ గ్రామీణ బ్యాంకు రీజియన్ మేనేజర్ ప్రభుదాస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ సుమంత్ రెడ్డి, జిల్లా గిరిజనాభివద్ధి అధికారి రమాదేవి, షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి అధికారి సజీవన్, అన్ని బ్యాంకుల మేనేజర్లు, సెర్ప్, మెప్మా సిబ్బంది సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.