calender_icon.png 13 August, 2025 | 1:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్పెషల్ బస్సుల్లోనే చార్జీలు పెంచాం

12-08-2025 11:47:50 PM

ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్..

హైదరాబాద్ (విజయక్రాంతి): రాఖీ పౌర్ణమి సందర్భంగా అన్ని బస్సుల్లో టికెట్ చార్జీలను టీజీఎస్‌ఆర్టీసీ పెంచిందని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్(RTC MD VC Sajjanar) ఒక ప్రకటనలో తెలిపారు. కొందరు పనిగట్టుకొని ఉద్దేశపూర్వకంగా సంస్థ ప్రతిష్ఠకు భంగం కలిగేలా చేస్తున్న ఈ అబద్ధపు ప్రచారాన్ని ఆయన ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం రాఖీకి ఈ నెల 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు నడిచిన స్పెషల్ బస్సుల్లో మాత్రమే చార్జీలు పెంచాచమని, రెగ్యులర్ సర్వీస్‌ల టికెట్ చార్జీల్లో ఎలాంటి మార్పు చేయలేదని స్పష్టం చేశారు. రాఖీ పండుగ నేపథ్యంలో ప్రయాణీకుల రద్దీ మేరకు 4,650 ప్రత్యేక బస్సులను సంస్థ నడిపించిందన్నారు.

ఈ స్పెషల్ బస్సులు మినహా మిగతా బస్సుల్లో సాధారణ చార్జీలే అమల్లో ఉన్నాయన్నారు. ప్రస్తుతం సంస్థలో 9500పైగా బస్సులు సేవలందిస్తున్నాయని... అందులో కొన్నింటినే స్పెషల్ సర్వీసులుగా రద్దీ రూట్లలో నడపడం జరిగిందన్నారు. ప్రధాన పండుగులైన సంక్రాంతి, దసరా, రాఖీ పౌర్ణమి, వినాయక చవితి, ఉగాది తదితర సందర్భాల్లో ప్రజలకు రవాణా పరంగా ఇబ్బందులు తలెత్తకుండా వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు స్పెషల్ సర్వీసులను ఆర్టీసీ యాజమాన్యం నడుపుతోందన్నారు. పండుగ రద్దీ రోజుల్లో స్పెషల్ బస్సులు మినహా.. సాధారణ రోజుల్లో యథావిధిగా సాధారణ టికెట్ ధరలే అమల్లో ఉంటాయన్నారు. ఇది సంస్థలో సంప్రదాయంగా కొనసాగుతున్న ప్రక్రియ అని అదేం తెలియకుండా కొందరు పండుగ పేరుతో అన్ని సర్వీసుల్లో చార్జీలను పెంచినట్టు ఉద్దేశపూర్వకంగా సంస్థపై అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు.