2 July, 2026 | 2:29 AM

అకారణంగా వృద్ధుడిపై దాడి.. ఆపై హత్య

02-07-2026 12:45 AM

నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, కేసు నమోదు                                

జవహర్‌నగర్, జూలై 1 (విజయక్రాంతి): అకారణంగా వృద్ధుడిపై దాడి చేసి ఆపై హత్య చేసిన సంఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్హెచ్‌ఓ సైదులు తెలిపిన కథనం ప్రకారం మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ సంతోష్ నగర్ కు చెందిన మడికే దేవరాజు అలియాస్ ఉప్పరి దేవరాజు(83) సంతోష్ నగర్ లో నివసిస్తున్నాడు.

మడిగే దేవరాజ్ కు ఐదుగురు కుమారులు కలరు. ఈ మధ్యనే దేవరాజ్ భార్య చనిపోవడం వల్ల కుమారులు అతని బాగోగులు చూసుకుంటున్నారు. ఈనెల 1వ తేదీన ఉదయం ఏడు గంటల సమయంలో దేవరాజు పక్క ఇంట్లో ఉండే రమేష్ అనే వ్యక్తి దేవరాజు కొడుకు ఉప్పరీ ప్రభాకర్ దగ్గరికి వెళ్లి రాత్రి సుమారు ఒంటిగంట సమయంలో దేవరాజ్ ఇంటికి ఎవరో గుర్తుతెలియని వ్యక్తి వచ్చారని ఇంట్లో గొడవ జరిగిందని చెప్పగా వెంటనే ప్రభాకర్ తన తండ్రి ఇల్లు ఉండే సంతోష్ నగర్ కు వచ్చి చూడగా దేవరాజు ఇంట్లో తన గదిలో నేలపై వెల్లకిలా పడి చనిపోయి ఉన్నాడు.

అతని తల వెనుక భాగం రక్తపు గాయాలతో పడి ఉన్నాడు. ఈ మేరకు పక్కనగల బెడ్ పై ఒక గుర్తు తెలియని వ్యక్తి పడుకొని ఉండడం గమనించి అతనిని నిలదీయగా పొంతనలేని సమాధానాలు ఇచ్చాడు. ఈ మేరకు ప్రభాకర్ వెంటనే పోలీసులకు ఇన్ఫామ్ చేయగా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని ఎంక్వయిరీ చేయగా తన పేరు దేవా అని సిద్దిపేట నుండి రాత్రి ఇక్కడికి పడుకోవడానికి వచ్చానని తెలిపాడు. ఇక్కడికి రాగా ఒక ముసలాయన లైట్ వేశాడని దాంతో కోపంతో పిడికిలి బిగించి పలుమార్లు తలమీద గుద్ది చంపినట్లు తెలిపాడు. అకారణంగా దేవరాజును కొట్టి చంపిన ఎడ్లదేవపై  దేవరాజు కొడుకు ప్రభాకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎడ్ల దేవాపై జవహర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.