24-07-2024 12:15:31 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 23 (విజయక్రాంతి): సైబర్ నేరగాళ్ల ఆగడాలు ఆగడం లేదు. తాజాగా బిట్‌కాయిన్‌లో పెట్టుబడులు పెడితే ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చని ఓ వ్యక్తి (57)ని నిండా ముంచేశారు. నగరానికి చెందిన ఓ వ్యాపారికి సైబర్ నేరగాళ్లు ‘క్వాంటం క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్’ లో పెట్టుబడులు పెట్టాలని సూచించారు. రాబోయే రోజుల్లో షేర్లు పెరగబోతున్నాయని, ఎక్కువ పెట్టుబడి పెడితే రాబడి బాగా వస్తుందని నమ్మించారు. ఇదంతా నిజమేనని నమ్మిన బాధితుడు పెట్టుబడి పెట్టాడు.
బాధితుడు డిపాజిట్ చేసిన మొత్తాన్ని ఉపసంహరించుకోకుండా ఖాతాను నిలిపివేసి, ప్రాసెస్ చేయడానికి మరింత డబ్బును చెల్లించాలని చెప్పారు. దీంతో సైబర్ నేరగాళ్ల సలహా మేరకు రూ. 3.5 లక్షలు చెల్లించాడు. అనంతరం వారి ఫోన్లు స్విచ్ఛాఫ్ రావడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు మంగళవారం బషీర్‌బాగ్ సీసీఎస్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఉద్యోగం ఇప్పిస్తామంటూ..
నగరానికి చెందిన 33 ఏళ్ల గృహిణికి ఉద్యోగావకాశం కల్పిస్తామని ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక మెసేజ్ వచ్చింది. దీంతో నిజమేనని నమ్మి ఆ లింక్‌పై క్లిక్ చేసింది. ఆ తర్వాత సైబర్ నేరగాళ్లు ఓటీపీ షేర్ చేయమని అడిగారు. ఓటీపీని షేర్ చేయడంతో బాధితురాలు తన ఫోన్ హ్యాక్ అయిందని గ్రహించింది. కొద్దిరోజుల తర్వాత బాధితురాలికి వారి నుంచి ఆమె నగ్న ఫొటోలు కొన్ని వచ్చాయి. తాము చెప్పినంతా డబ్బు ఇవ్వకపోతే ఫొటోలను తెలిసిన వారందరికీ పంపిస్తామని బెదిరించారు. దీంతో వారు చెప్పినట్టు డబ్బు చెల్లించింది.
అనంతరం లక్నో పోలీసుల పేరుతో ఆమెకు ఫోన్ కాల్స్ వచ్చాయి. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నావని, నీపై అరెస్టు వారెంట్ జారీ అయిందని, సమస్యను పరిష్కరించడానికి డబ్బు చెల్లించాలని సూచించారు. దీంతో బాధితురాలు తన ఖాతాలో ఉన్న డబ్బులను వారు చెప్పిన ఖాతాకు బదిలీ చేసింది. మొత్తంగా ఆమె నుంచి రూ. 2.94 లక్షలను వసూలు చేశారు. అనంతరం సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయానని గ్రహించిన బాధితురాలు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసి, తన డబ్బును రికవరీ చేసి ఇవ్వాలని ఫిర్యాదు చేసింది.
పటాన్‌చెరులో సైబర్ మోసం
పటాన్‌చెరు: పటాన్‌చెరులో సైబర్ మోసం జరిగింది. సీఐ ప్రవీన్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. ఏపీఆర్ గ్రాండియో గేటేడ్ కమ్యూ నిటీలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి ఫోన్‌కు ఈ నెల 22న వాట్సాప్‌లో స్టాక్‌మార్కెట్ పేరిట మెస్సేజ్ వచ్చింది. ఆ లింక్‌ను ఓపేన్ చేసి యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్నాడు. యాప్ ద్వారా స్టాక్ మార్కెట్‌లో రూ.99,78,256లను పెట్టుబడి పెట్టాడు. ఆ తర్వాత మోసపోయానని తెలుసుకున్న బాధితుడు అదేరోజు రాత్రి 11గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పటికే జరగాల్సిన నష్టం జరగగా.. సైబర్ క్రైమ్ పోలీసులు ఫ్రాడ్ స్టార్ అకౌంట్లలో రూ.24లక్షలు నిలువరించారు.
సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు
హైదరాబాద్ సిటీబ్యూరో: అంతర్జాతీయ సైబర్ నేర లింకును హైద రాబాద్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఛేదించింది. సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్న కిషాన్‌బాగ్‌కు చెందిన మహ్మద్ ఇలియాస్ (38), కార్వాన్‌కు చెందిన మహ్మద్ రిజ్వాన్ (32), చార్మినార్ తలబ్‌కట్టకు చెందిన సయ్యద్ గులాం అస్కైరీ (42) ను మంగళవారం అరెస్టు చేశారు. సైబర్ నేరగాళ్లు ఇటీవల హైదరాబాద్‌కు చెందిన 75 ఏళ్ల వృద్ధుడి నుంచి రూ.5.40 కోట్లు కాజేశారు. ఇందుకోసం ఈ ముగ్గురి నిందితుల బ్యాం కు ఖాతాలనే వినియోగించుకున్నారు.
అరెస్టయిన ముగ్గురి వద్ద మొత్తం 17 బ్యాంక్ ఖాతాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఖాతాలో జమ అయిన డబ్బును వీరు విత్‌డ్రా చేసి దుబాయ్ లో ఉన్న కీలక నిందితుడు సయ్యద్ ముస్తాఫా(ఏ1)కు క్రిప్టో కరెన్సీ రూపం లో పంపుతున్నారు. అక్కడి నుంచి నగదు చైనాకు వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బ్యాంకు ఖాతాలు అందించినందుకు వీరికి 10 శాతం కమీషన్ అందజేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. త్వరలోనే మిగతా నిందితులను అరెస్టు చేస్తామని టీజీసీఎస్‌బీ డైరెక్టర్ శిఖా గోయల్ పేర్కొన్నారు.