రాకమచర్ల వెంకటదాసు సంచిక ఆవిష్కరణ
హాజరైన తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు డా. ఏనుగు నరసింహరెడ్డి
చేవెళ్ల /నవాబ్ పేట్ 26(విజయక్రాంతి): తెలంగాణ వాగ్గేయ కారులు శ్రీ రాకమచర్ల వెంకట దాసు జీవితం సాహిత్యంపై రవీంద్ర భారతిలో జరిగిన జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు డా. ఏనుగు నరసింహరెడ్డి హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్టం వికారాబాద్ జిల్లా ఉమ్మెత్తల గ్రామంలో రాకమచర్ల వెంకట దాసు పీఠం నెలకొల్పి లక్షకు పైగా సంకీర్తనలు రచించారన్నారు.
ఈ ప్రాంతాన్ని భక్తి ప్రపత్తులతో ముంచెత్తి చక్కటి దాస సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఆయన రచించిన కీర్తనలు భాషా సౌందర్యంతో పండిత పాములను సైతం ఆకట్టుకుంటాయని స్పష్టంచేశారు. అనంతరం ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ... అమ్మ చిన్నప్పుడు ఒళ్ళో పడుకోబెట్టుకొని రాకంచెర్ల వెంకట దాసు కీర్తనలు పాడి జోల పుచ్చేదన్నారు.
తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డా. నామోజుబాలాచారి సంచిక ఆవిష్కరించి కీర్తనలు ప్రచారం చేయడంలో భాగస్వాములు కావాలని ప్రపంచానికి అందించాలని ఉద్ఘాటించినారు. జాతీయస్థాయి వివిధ యూనివర్సిటీల నుంచి లబ్ద ప్రతిష్టలైన సాహితీవేత్తలు ప్రొఫెసర్లు 20 మందికి పైగా పాల్గొని వెంకట దాసుపై వ్యాస పత్రాలు సమర్పించారు.
అనంత వ్యవస్థాపక అధ్యక్షులు డా. తూర్పు మల్లారెడ్డి మాట్లాడుతూ... ఉమ్మడి రాష్టంలో తెలంగాణ భాషా సాహిత్యాలను నిర్లక్ష్యం చేసి ఆంధ్ర సాహిత్యాన్ని రుద్ది తెలంగాణ సాహిత్య సంస్కృతిక సాంప్రదాయాలను మంటకలిపినారని చెప్పారు. సాహిత్యంలోని ప్రక్రియలు తెలంగాణలో మొదట వచ్చినవని తెలిపారు. తొలి తెలుగు కవి కూడా తెలంగాణ వాడేనని తొలి తెలుగు కథానిక, తెలుగు సినిమా పాట, తెలుగు కావ్యం, తెలుగు శతకం, తెలుగు యక్షగానం... ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ప్రక్రియ తెలంగాణలోనే ఉద్భవించిందని స్పష్టం చేశారాయన.
ఈ కార్యక్రమంలో వికారాబాద్ అక్నాపూర్ భజన బృందం భజనతో ప్రేక్షకుల కట్టుకున్నారు. వెంకటదాసు సంచికను తెలంగాణ సాహిత్య అకాడమీ ముద్రించనుందని నామోజు బాలాచారి తెలిపారు. ఈ కార్యక్రమంలో అనంత వ్యవస్థాపకులు దోరవేటి అధ్యక్షులు ఆశీర్వాదం కార్యదర్శి కమలేష్ ఉపాధ్యక్షులు వడచర్ల సత్యం అనంత సభ్యులు మమ్మద్ రవూఫోద్దీన్ కడియాల మధుసూదన్ డా. డాకన్న సురేష్ కొనింటి రమేష్ ఆకుల మల్లికార్జున్ ప్రముఖ కవి కృష్ణస్వామి దుబ్బాకుల తదితరులు పాల్గొన్నారు.






