calender_icon.png 13 January, 2026 | 12:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇరాన్ ప్రభుత్వం హద్దు మీరుతోంది !

13-01-2026 01:46:13 AM

ఇంటర్నెట్ సేవల నిలిపివేత తగదు

మేం ‘స్పేస్ ఎక్స్’ సాయంతో సేవలను పునరుద్ధరిస్తాం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

అవసరమైతే సైనిక చర్యకు దిగుతామని పరోక్ష వ్యాఖ్యలు

వాషింగ్టన్/టెహ్రాన్: ‘ఇరాన్ ప్రభుత్వం హద్దు మీరుతోంది. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న ఇరానీయన్లపై హింసను సహించం. ప్రజా నిరసనల అణచివేతను ఉపేక్షిం’ అంటూ తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్‌లో రెండు వారాల నుంచి జరుగుతున్న ఘర్షణల్లో 500 మందికి పైగా మృతిచెందడం, ౧౦ వేల మంది పౌరులను అదుపులోకి తీసుకోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్‌వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు నిలిపేవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఆ దేశంలో ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించేందుకు అవసరమైతే తానే స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్‌తోనైనా మాట్లాడతానని చెప్పుకొచ్చారు. స్టార్‌లింక్ శాటిలైట్ నెట్‌వర్క్‌ను వినియోగించైనా అక్కడి ప్రజలకు కమ్యూనికేషన్ సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు.

అవసరమైతే తాము ఇరాన్‌లో సైనిక చర్యకు దిగుతామని సంకేతాలిచ్చారు. తాము ఇప్పటికే ఇరాన్ ప్రతిపక్ష నాయకులతో కూడా తాను టచ్‌లో ఉన్నానని తెలిపారు. మరోవైపు ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఖెర్ ఖలీబాఫ్ స్పందిస్తూ.. అమెరికా ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. మరోవైపు దేశవ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు వెల్లువెత్తుతున్న వేళ.. ఇరాన్ ప్రభుత్వం రివర్స్ డ్రామా షురూ చేసింది. తాజాగా ప్రభుత్వానికి మద్దతుదారులంటూ లక్షలాది మందిని కూడగట్టింది. వీరంతా టెహ్రాన్‌లోని ఓ ప్రధాని కూడలి వద్దకు వచ్చి ప్రభుత్వానికి అనుకూలమైన నినాదాలు ఇచ్చారు. వారిలో ప్రభుత్వ పెద్దలు కూడా ఉండటం గమనార్హం. 

వెలుగులోకి అణచివేత 

ఇరాన్ పౌరుల అణచివేత విషయంలో తాజాగా ఓ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. దేశ్యాప్తంగా సుమారు ౫౦ వేల ‘స్టార్‌లింక్’ సాంకేతికత ద్వారా తాము సాయుధ బలగాల నుంచి ఎదుర్కొంటున్న ఇబ్బందులను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ చివరి అవకాశాన్ని కూడా దెబ్బతీసేందుకు ఇరాన్ ప్రభుత్వం ‘కిల్ స్విచ్ ఆన్’ అనే అత్యాధునిక సాంకేతికత వినియోగిస్తోందని కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేస్తున్నాయి. మరోవైపు అత్యంత ఖరీదైన, మిలిటరీ స్థాయి ‘జామింగ్ పరికాలు’ వినియోగించే స్థాయికి ఇరాన్‌కు లేదని, ఆ సాంకేతికతను రష్యానే అందించి ఉండవచ్చని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ జామింగ్ కారణంగా స్టార్‌లింక్ సిగ్నల్స్ 80 శాతానికి పైగా తగ్గిపోయాయని పేర్కొంటున్నారు.