08-08-2025 05:23:21 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి(Bellampalle) పట్టణంలో మొదటి శ్రావణ శుక్రవారం సందర్భంగా మహిళలు వరలక్ష్మీ వ్రతాలను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. ప్రతి ఇంట్లో అమ్మవారి ప్రతిమలను అత్యంత సుందరంగా ముస్తాబు చేశారు. అత్యంత పవిత్రమైన అమ్మవారికి పూలు, మట్టి గాజులు, వెండి మెట్టెలు, బంగారు ఆభరణాలను తొడిగి దేదీప్యమానంగా అలంకరించారు. పాలు, బెల్లం, పళ్ళు, నేతితో కూడిన నైవేద్యాలతో పాటు, పట్టు వస్త్రాలను సమర్పించి నిండుగా మొక్కులను తీర్చుకున్నారు. ఇళ్లల్లో ప్రత్యేక పూజల అనంతరం మహిళలు తమలపాకులు, పళ్ళను ఒకరికొకరు వాయినంగా ఇచ్చుకున్నారు. అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన శనిగలు, బెల్లం, పళ్ళు, పులిహోర, పాయసాలను తీర్థప్రసాదాలుగా స్వీకరించారు. అష్టైశ్వర్యాలు సిద్ధించాలంటూ వరలక్ష్మి పూజలో పాల్గొన్న మహిళలు అమ్మవారిని ప్రణమిల్లారు.