సాంస్కృతిక వారధి వేదకుమార్
హైదరాబాద్ నగరంలో చెప్పుకోదగిన వ్యక్తుల్లో మణికొండ వేదకుమార్ ప్రముఖులు. చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించే వ్యక్తి ఆయన. నగరంలో చరిత్రకు సంబంధించిన ఏ కార్యక్రమంలోనైనా వారు ఉండవలసిందే. అట్లా నేను వారిని మా ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనే మొదటిసారి కలిశాను. ఆ పరిచ యంతో వారి ఆక్స్‌ఫర్డ్ హైస్కూల్‌లో నా మనుమడు జై ఆదిత్యకు ప్రాథమికంగా ప్ర వేశం సంపాదించాను.
2010లో వేదకుమార్ ‘తెలంగాణ రిసో ర్స్ సెంటర్’ను స్థాపించి, మన సంస్కృతికి, కళలకు ప్రాధాన్యం ఇస్తూ నిర్వహించే మేధో చర్చల్లో నాకు పాల్గొనే అవకాశం లభించింది. 2012లో వారు ‘డెక్కన్ ల్యాండ్’ తెలు గు మాస పత్రికను స్థాపించి నిరాఘాటంగా ఎన్నో చారిత్రక విశేషాలను, వారసత్వ సంపదలను వ్యాసరూపంలో అందజేస్తున్నారు. ‘డెక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్’కు చైర్మన్‌గా ఉండి, సేవలందిస్తున్నారు.
వేదకుమార్‌ను స్వయంగా కలవాలనే నా కోరిక సముద్రాల ధనంజయ వల్ల నెరవేరింది. వేదకుమార్‌తో ధనంజయకి ఉన్న స్నేహం అజరామరమైంది. ఇద్దరిని కలిపి చూస్తే కృష్ణార్జునులనిపిస్తారు. ఒక రోజు ధనంజయ నన్ను స్వయంగా వేదకుమార్ ఇంటికి తీసుకెళ్లారు. వేదకుమార్ ప్రేమతో ఆహ్వానిం చి నేను ఇటీవల రచించిన ‘సంపూర్ణ యోగ దర్శనం’ గ్రంథాన్ని స్వీకరించారు. వట్టిగా నన్ను పంపించక ఘనంగా సత్కరించారు.
అప్పుడే నేను రచించిన ‘వేద స్వరాలు’ అనే పుస్తకాన్ని వారికి అంకితం చేయాలనే తలం పు కలిగింది. వారింటి నుంచి తిరిగి వస్తున్నప్పుడు, వారి తండ్రిగారి ‘కర్తవ్య దర్పణము’ అనే పుస్తకాన్ని నాకు బహూకరించారు. అది ప్రముఖ ఆర్య సామాజికులైన ‘మహాత్మా నారాయణ స్వామి’ హిందీలో రచించిన ‘కర్తవ్య దర్పణ్’కు తన తండ్రిగారైన మణి కొండ భూపతిరావు తెనుగు అనువాదం. ఈ అనువాద గ్రంథం చూడగానే నా ఆధ్యాత్మిక గురువైన పండిత గోపదేవ శాస్త్రి నా కళ్ల ముందు నిలిచారు.
మణికొండ భూపతిరావు గారిది ఆర్య సంప్రదాయం. వారు దయానందుని బాటలో నడిచినవారు. వారికి వేదమన్నా, యజ్ఞమన్నా, సనాతన ధర్మమన్నా ఎంతో ఇష్టం. వేదకుమార్ మీద తన తండ్రిగారి ప్రభావం ఎంతో ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. యమనియమనిష్ఠాగరిష్ఠులైన తండ్రికి తగిన పుత్రుడు లభించడం గొప్ప అదృష్టమే కదా!
వేదకుమార్ విద్యార్హతలు, సేవా కార్యక్రమాలు, సంస్థల నిర్వహణ గురించి ఎంత చెప్పినా తక్కువే. వారు మణిపూర్ విశ్వవిద్యాలయం నుంచి సివిల్ ఇంజినీరింగ్‌లో బీ ఈ పట్టా, జేఎన్‌టీయూ హైదరాబాద్ నుం చి అర్బన్ అండ్ రీజినల్ ప్లానింగ్ (ఎంయూఆర్‌పీ)లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. తమ వృత్తిని కొనసాగిస్తూ రెండు దశాబ్దాలుగా హైదరాబాద్ నగరంలోని ఆర్కిటెక్చర్ హెరిటేజ్, ప్లానింగ్ విద్యాసంస్థల్లో విజిటింగ్ ప్రొ ఫెసర్‌గా సేవలందిస్తున్నారు.
వారసత్వ పరిరక్షణ, పర్యావరణ రూపకల్పన మొదలైన విషయాలపై వారు చేసిన ఉపన్యాసాలు అమూల్యమైనవి. వేదకుమార్ కేవలం ఇంజినీరుగానే కాక, సాహిత్య కార్యకర్తగా, పత్రిక సంపాదకులుగా, ప్రచురణకర్తగా, వారసత్వ పరిరక్షకునిగా, విద్యావేత్తగా పేరు సంపాదించారు. పిల్లల విద్యాభివృద్ధి పట్ల గల అంకి తభావంతో ‘చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ’ని స్థాపించి, ఇప్పటివరకు 50 దాకా బా లల పుస్తకాలు ప్రచురించారు. ‘బాలచెలిమి’ అనే ‘తెలుగు బాల మాసపత్రిక’ను ప్రారంభించి, దానిని బాలల అభివృద్ధి పత్రికగా తీర్చిదిద్దారు.
2024లో ‘బాలచెలిమి’ సాహిత్య ఉద్యమంలో భాగంగా ‘బాలచెలిమి ముచ్చట్లు’ అనే పేరుతో నెలవారీ సాహిత్య కార్యక్రమాలు నిర్వహించారు. ‘బాలచెలిమి గ్రంథాలయాలు’ అనే కార్యక్రమాన్ని 21 జి ల్లాలకు విస్తరించి, పోచంపల్లిలో తొలి గ్రం థాలయాన్ని స్థాపించారు. 2025లో ‘బాలచెలిమి జాతీయ కథా పోటీ’ పిల్లల కోసం పె ద్దలు రచించిన కథలు, యువ రచయితల కథలు, పాఠశాల విద్యార్థుల కథలు అనే మూడు విభాగాల్లో నిర్వహిస్తూ, కథా రచయితలకు ఒక విలక్షణమైన వేదికనందించారు.
వేదకుమార్ బాధ్యతలు అపూర్వమైనవి. వారు ‘ఐకోమోస్ ఇండియా’ సభ్యులుగా ఉండి పలు వారసత్వ కార్యక్రమాల్లో పాల్గొనడమే కాక, ‘హైదరాబాద్ హెరిటేజ్ లిఫ్టింగ్ ప్రాజెక్టు’కు నాయకత్వం వహించి జీహెచ్‌ఎంసీ పరిధిలో 1400కు పైగా వారసత్వ కట్టడాలను గుర్తించారు. 10,000కు పైగా చెట్లను నరికివేతల నుంచి కాపాడి ‘ట్రాన్స్‌లోకేషన్’ ప్రక్రియను అమలు చేశారు. 2007లో ‘మూసీ పరిరక్షణ అధ్యయన ప్రాజెక్టు’కు నాయకత్వం వహించి బెర్లిన్‌లోని హుంబోల్డ్ యూనివర్సిటీలో పరిశోధ న పత్రాన్ని సమర్పించారు.
వారసత్వ కట్టడాల అధ్యయనం సాగి స్తూ, రోమ్, పారిస్, ఇస్తాంబుల్, మొరాకో, బీజింగ్, ఆస్ట్రేలియా, అమెరికా లాంటి దేశా లు, నగరాలను సందర్శించారు.
ప్రముఖ దర్శకులైన బి.నర్సింగ్‌రావుతో కలిసి పురస్కారం పొందిన డాక్యుమెంటరీ, ఫీచర్ చిత్రాల నిర్మాణంలో భాగస్వాములయ్యారు. మట్టి మనుషులు చిత్రానికి సహ నిర్మాతగా పనిచేసి 1991లో అప్పటి భారత రాష్ట్రపతి చేతులమీదుగా జాతీయ పురస్కారం అందుకున్నారు.
నిరాడంబరత, నిర్భయత్వం, మానవత్వం మూర్తీభవించిన వేదకుమార్ సాధా రణ జీవనాన్ని గడుపుతూ, నిరంతరం అటు సామాజిక కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ, ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. బాలసాహిత్యం అంటే కేవలం వినోదానికే పరిమితం కారాదు, వారిలో సృజనాత్మక శక్తిని, వైజ్ఞానిక పరిపుష్టిని పెంచడానికి దోహ దం చేయాలనే వేదకుమార్.. బాలల కల్పతరువుగా భాసిస్తారు. పిల్లలను పాఠకులుగా, రచయితలుగా, ఆలోచనాశీలురుగా, వారసత్వ పరిరక్షకులుగా తీర్చిదిద్దాలనే వారి స దాశయం ఎంతో గొప్పది.
వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వేదకుమార్ తమ వ్యవసాయ క్షేత్రంలో పనిచేసే వారి కష్టసుఖాల్లో పాలుపంచుకునేవా రు. పర్యావరణం అంటే క్రీడాస్థలం, చెట్లంటే ఆయనకు ప్రాణం. వారసత్వ కట్టడాలంటే ప్రేమజూపిన వేదకుమార్.. సంప్రదాయ కళల్లో భాగమైన చెక్కబొమ్మల (పప్పెట్) ఆటను ప్రోత్సహించి, పంచతంత్ర కథల ఆధారంగా 200 కిట్లను తయారుచేయడం విశేషం.వేదకుమార్ వల్ల సాహిత్య, సాంస్కృతిక, వారసత్వ రంగాల్లో ఒక విధమైన విప్ల వం మొదలైంది. వారి వల్ల ఎంతో మంది రచయితలు, కళాకారులు, మేధావులు ప్రభావితులైనారు. వేదకుమార్ వల్ల భాగ్యనగరం సాంస్కృతికంగా భాగ్యవంతమైందని భావించవచ్చు.
వ్యాసకర్త సెల్: 9885654381
ఆచార్య మసన చెన్నప్ప






