01-09-2025 09:06:53 PM
బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో భారీ వర్షాలకు ఇళ్లు ధ్వంసమై నష్టపోయిన నిరుపేదలకు ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ, సోమవారం మోస్రా తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం మండల రెవెన్యూ ఇన్స్ పెక్టర్ నాగమణికి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సీపీఎం ఏరియా కార్యదర్శి నన్నేసాబ్ మాట్లాడుతూ... భారీ వర్షాలకు ధ్వంసం అయిన నిరుపేదల ఇండ్లను గుర్తించడంలో అధికారులు విఫలమయ్యారని మండిపడ్డారు. అధికారుల నిర్లక్ష్యంతో నిరుపేదలు నష్టపరిహారాన్ని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మండలంలో ధ్వంసమైన ఇండ్లను పూర్తిగా గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపాలని డిమాండ్ చేశారు. లేకపోతే పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.