calender_icon.png 2 September, 2025 | 12:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అప్పుడే మంచిగా ఉండే కార్యక్రమానికి జన నీరాజనం

01-09-2025 07:57:15 PM

-ప్రజల్లోకి బిఆర్ఎస్ అభివృద్ధి, కాంగ్రెస్ వైఫల్యాలు*

-బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు బాల్క సుమన్

మందమర్రి (విజయక్రాంతి): అప్పుడే మంచిగా ఉండే, మా గ్రామం నుంచి పోరాటం అంటూ బీఆర్ఎస్ పార్టీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా ప్రజలు స్వాగతిస్తూ నీరాజనాలు పలుకుతున్నారని జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్(Former MLA Balka Suman) స్పష్టం చేశారు. సోమవారం పట్టణంలోని పాత బస్టాండ్ లో అప్పుడే మంచిగా ఉండే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంతో బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకు పోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాలలో భాగంగా జిల్లాలో పైలేట్ ప్రాజెక్టుగా ఎంపికైన పట్టణంలో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి ప్రజల నుండి సమస్యలను, అభిప్రాయాలను సేకరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్వయంగా మొదటి ఫిర్యాదును నమోదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధికై స్థానిక సంస్థల ఎన్నికల వేళ, గ్రామాల నుంచే మరల పోరాటం ప్రారంభించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

ఏళ్ల తరబడి సంపాదించుకున్న అభివృద్ధి, సంక్షేమం, ఆత్మగౌరవం ఇవన్నీ తిరిగి పొందాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి గ్రామం ఇంటి నుండి  ముందుకు వచ్చే గొంతుల సమావేశమే అప్పుడే మంచిగా ఉండే కార్యక్రమం అని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంతో అప్పుడే మంచిగా ఉండే అంటూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపట్టిన రైతు బంధు, రైతు బీమా, కాళేశ్వరం ప్రాజెక్టు, కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, 24 గంటల కరెంటు, కేసీఆర్ కిట్, కంటి వెలుగు, ఆసరా పెన్షన్ వంటి నాటి పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడం జరుగుతుందన్నారు. అదేవిధంగా 6 గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసాన్ని వివరించడంతో పాటు ఎన్నికల సమయంలో ఇచ్చి మరచిన హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లడం జరుగు తుందన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ చెన్నూరు నియోజకవర్గ ఇంచార్జ్  డాక్టర్ రాజా రమేష్, పట్టణ అధ్యక్షుడు జే రవీందర్, టిబిజికేఎస్ ఏరియా ఉపాధ్యక్షులు మేడిపల్లి సంపత్, ఓ రాజశేఖర్, తిరుపతిరెడ్డి లతో పాటు టిఆర్ఎస్ దాని అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.