01-09-2025 08:18:05 PM
మందమర్రి,(విజయక్రాంతి): మండలంలోని శంకరపల్లి గ్రామ ప్రజల సౌకర్యార్థం కేకే 5 గని నుండి శంకరపల్లి రహదారి మధ్యలో ఉన్న పాలవాగుపై వంతెన నిర్మించాలని కోరుతూ శంకరపల్లి గ్రామస్తులు దూట తిరుపతి ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. సోమవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తిరుపతి మాట్లాడుతూ... కేకే 5 గని నుండి శంకర్పల్లి వరకు సుమారు మూడు కిలోమీటర్ల దూరం ఉంటుందని వర్షా కాలంలో ఈ రహదారి గుండా ప్రయాణించడం కష్టమవుతుందని, వర్షాలు కురిసి వాగులు పొంగితే ఈ దారి గుండా రవాణా పూర్తిగా నిలిచిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని గ్రామస్తుల చిరకాల వాంఛ అయిన పాలవాగుపై వంతెన నిర్మించి ఇబ్బందులు తొలగించాలని కోరారు. అలాగే మండలంలోని సండ్రోన్ పల్లి నుండి శంకర్పల్లి కి వెళ్ళే రహదారి పూర్తిగా ధ్వంసం అయిందని వెంటనే బిటి రోడ్డు ఏర్పాటు చేసి గ్రామస్తులకు రహదారి సౌకర్యం కల్పించాలని కోరారు.