01-09-2025 08:06:55 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): సీపీఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానం ఓపీఎస్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ మహబూబాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జేఏసీ చైర్మన్ వడ్డబోయిన శ్రీనివాస్, సెక్రటరీ జనరల్ ఎండీ రఫీ, రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు సామ మల్లారెడ్డి మాట్లాడుతూ... ప్రపంచ బ్యాంకు ఒప్పందాల్లో భాగంగా, ప్రపంచ బ్యాంకు షరతులకు లోబడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2004 సెప్టెంబర్ నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తున్నారని ఇది ఉద్యోగ, ఉపాధ్యాయ కుటుంబాలకు పెను శాపంగా మారిందని ఆరోపించారు.
ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు రిటైర్మెంట్ అయిన తర్వాత కనీసం గౌరవప్రదమైన జీవితాన్ని గడప లేకుండా ఉందని, ప్రభుత్వం అందించే ఆసరా పెన్షన్ కంటే తక్కువగా రిటైరైన ఉద్యోగులకు పెన్షన్ అందుతుందని ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంలో సిపిఎస్ నుంచి వైదొలిగి పాత పెన్షన్ విధానంలోకి మారే అవకాశం ఉన్నప్పటికీ గత ప్రభుత్వము సిపిఎస్ లో కొనసాగుతామని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడం ఉద్యోగ ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. అనేక పోరాటాల ఫలితంగా కేంద్రం సిపిఎస్ ను యుపిఎస్ గా మార్చిందని, ఇది కూడా ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, తప్పనిసరిగా పాత పెన్షన్ విధానాన్ని అమలుపరచాలని డిమాండ్ చేశారు