calender_icon.png 2 September, 2025 | 12:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కులగణన సర్వే సిబ్బందికి పారితోషికం ఇప్పించాలి..

30-08-2025 06:34:00 PM

వెంకటాపురం నూగూరు (విజయక్రాంతి): గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణన సర్వేలో పాల్గొన్న సిబ్బందికి పారితోషికం వెంటనే విడుదల చేయాలని సర్వేలో పాల్గొన్న సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. కులగణన సర్వేలో 15 రోజులు పాటు పాల్గొన్న సిబ్బందికి మొదట్లో నిధులు మంజూరు చేసిన ఆ తర్వాత ఆ నిధులను మళ్లించడం పట్ల సర్వేలో పాల్గొన్న సిబ్బంది అసంతృప్తి  వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ప్రయాసలకు ఓర్చి అంకితభావంతో సర్వే నిర్వహించిన తమకు ఇప్పటివరకు పారితోషకం చెల్లించకపోవడం పట్ల వారు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సర్వే ప్రారంభానికి ముందే నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించగా సర్వే అనంతరం ఆ నిధులను మళ్లీ వేరే బడ్జెట్కు తరలించడంతో ఇప్పటివరకు సర్వేలో పాల్గొన్న సిబ్బందికి లభించలేదని వారు వాపోతున్నారు. 

సర్వేలో పాల్గొన్న ఎన్యుమరేటర్లకు రూ. 10 వేలు, సూపర్వైజర్లకు రూ. 12 వేలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు షిఫ్టుల వారీగా రూ.750లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విడుదల చేసిన నిధులను తిరిగి ఇతర పనులకు మళ్లించడంతో గత పది నెలలుగా సిబ్బంది ఆ నిధుల కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబాలను వదిలి 15 రోజులకు పైగా ఈ సర్వేలో పాల్గొన్న తమపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సర్వేలో పాల్గొన్న సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి తమ సర్వేలో పాల్గొన్న సిబ్బందికి నిధులను వెంటనే కేటాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.