21-05-2025 01:09:40 AM
స్వర్ణోత్సవ వైభవం.. కన్నుల పండువగా శ్రీనివాసుని కల్యాణ మహోత్సవం
సిద్దిపేట, మే 20 (విజయక్రాంతి): సిద్దిపేట వెంకటేశ్వర ఆలయం బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. చిన్న జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతున్న ఈ వేడుకలలో భాగంగా జరిగిన శ్రీనివాసుని కళ్యానోత్సవం కన్నుల పండుగగా జరిగింది.
చిన్న జీయర్ స్వామి, మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, మెదక్ పార్లమెంటు సభ్యులు మాధవినేని రఘునందన్ రావు, పలు పార్టీల ముఖ్య నాయకులు కార్యకర్తలు కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. హరీష్ రావు నాయకునిగా ఉండటం ఈ ప్రాంత ప్రజల అదృష్టం. సిద్దిపేట అంటే ఆదర్శం, సిద్దిపేట అంటే అభివృద్ధి, సిద్దిపేట అంటే అవార్డులు ఇలా ఎన్నో ప్రత్యేకతలు సాధించిన సిద్దిపేట హరీష్ రావు పనితీరుకు, పట్టుదలకు నిదర్శనమని చిన్న జీయర్ స్వామి అన్నారు.
సిద్దిపేట వెంకటేశ్వర స్వామి ఆలయం బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న చిన్న జీయర్ స్వామి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంను సందర్శించారు. కాసేపు ఆత్మీయంగా ముచ్చటించారు. ఈ సందర్బంగా సిద్దిపేట అభివృద్ధిని చిన్న జీయర్ స్వామికి హరీష్ రావు వివరించారు. మీరు మా ఇంటికి రావడం మేము ఎంతో పుణ్యంగా భావిస్తున్నామని, మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ ప్రజల ఫై, మా ఫై ఉండాలన్నారు. హరీష్ రావు కోరారు.
మళ్లీ కేసీఆర్ రావాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ రాష్ట్రం సాధించిన కెసిఆర్ పరిపాలన మళ్లీ రావాలని, తెలంగాణకు పూర్వ వైభవం రావాలని యావత్ తెలంగాణ ప్రజానీకం ఎదురు చూస్తుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. ఏదో మార్పు తెస్తారని అనుకోని కాంగ్రెస్ కు ఓటు వేసి గెలిపిస్తే రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధిలో వెనుకకు నెట్టి దివాలా తీస్తున్నాడని విమర్శించారు.
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నాగరాజుపల్లి గ్రామంలో జరుగుతున్న శ్రీ రేణుకా ఎల్లమ్మ వార్షికోత్సవంలో భాగంగా నిర్వహించిన కళ్యాణ మహోత్సవానికి హరీష్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సంవత్సరం కూడా మంచిగా కాలం కావాలని, మంచి పంటలు పండాలని, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు.
పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి సిద్దిపేట దేవస్థానం బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామనుజ చిన్న జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహించిన శ్రీవారి చతుర్థ పుష్కరోత్సవ ప్రయుక్త పంచాశ బ్రహ్మోత్సవాళ్ళో మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు, బిజెపి సిద్దిపేట జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ముదిరాజ్ పాల్గొన్నారు.