21-05-2025 01:13:31 AM
హర్యానాలోని అశోక యూనివర్సిటీ ప్రొఫెసర్‌కు జైలు
న్యూఢిల్లీ, మే 20: ‘ఆపరేషన్ సిందూర్’పై వివాదస్పద పోస్టు చేసిన హర్యానాలోని అశోక యూనివర్సిటీ పొలిటి కల్ సైన్స్ విభాగ అధిపతి ప్రొఫెసర్ అలీఖాన్ మహ్మదాబాద్‌కు సోనెపట్ కోర్టు మంగళవారం 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీ విధించింది. అలీఖాన్ మహ్మదాబాద్.. కల్నల్ సోఫియా ఖురేషి, వ్యోమికా సింగ్‌లను అగౌరవపరిచే విధంగా సోషల్ మీడియాలో ‘ఇద్దరు మహిళా సైనికులు మీడియా సమావేశాల్లో వెల్లడిస్తున్న అంశాలు క్షేత్రస్థాయిలో వాస్తవికతను ప్రతిబింబించాలి.
లేదంటే అవి కేవలం కపటత్వం మాత్రమే’ అని ఓ పోస్ట్ పెట్టారు. దీనిపై బీజేపీ యువ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యోగేశ్ జతేరి పోలీసులకు ఫిర్యాదు చేయగా ప్రొఫెసర్‌ను అరెస్ట్ చేశారు. హర్యానా మహిళా కమిషన్ కూడా కేసు నమోదు చేసింది. దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను ప్రమాదంలో పడేసినందుకు ప్రొఫెసర్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపింది. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని అలీఖాన్ చెప్పారు.