21-05-2025 01:08:00 AM
-మహిళలను విచారించిన జిల్లా ఆడిట్ అధికారిని జయశ్రీ
-రుణంతో పాటు పొదుపు డబ్బులను డ్రా చేసిన ఆర్పీ
-బ్యాంకు లో విచారించిన తర్వాత పూర్తి నివేదిక సమర్పిస్తాం
-మెప్మా రుణాలలో అక్రమాలపై మరోసారి కొనసాగిన విచారణ
-అక్రమ సొమ్ము పంచుకున్న ఆర్పి, సీఓ
-దాదాపు కిలో బంగారం క్రయవిక్రయాలు చేసిన ఆర్పీ
గజ్వేల్, మే 20: గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని మెప్మా రుణాల అక్రమా లలో మరో ఐదు మహి ళా సంఘాలు బలైనట్లు విచారణ తేలింది. మెప్మా రుణాల అవకతవకలపై జరుగుతున్న విచారణలో భాగంగా మంగళవారం జిల్లా ఆడిట్ అధికారి జయశ్రీ మరో 5 మహిళా సంఘాల గ్రూపుల సభ్యులను విచారణ చేశారు.
ఈ విచారణలో ఆయా గ్రూపుల సభ్యులు వెల్లడించిన విషయాలు మరింత దారుణంగా ఉన్నాయి. సభ్యుల పేరిట రెండు లక్షల చొప్పున రుణాలు ఇప్పించి ఆ సభ్యుల నుండి తిరిగి ఆర్పి కృష్ణ లీల డబ్బులను డ్రా చేయించి తీసుకున్నట్టు వెల్లడైంది. ఈ క్రమంలో మహిళా సంఘాల సభ్యులు పొదుపు చేసుకున్న డబ్బులు కూడా డ్రా చేయడం గమనార్హం.
రుణాలు పొందిన మహిళా సంఘాలలో సగం మంది వేరే గ్రూపుల సభ్యులు ఉండడంతో పాటు ఆర్ పి కుటుంబ సభ్యురాలు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. డ్రా చేసిన డబ్బులతో ఆర్ పి దాదాపు 90 తులాలకు పైగా బంగారం క్రయవిక్రయాలు చేసినట్టు తెలుస్తుంది. బ్యాంకులో ఆయా గ్రూపుల లావాదేవీలు పరిశీలిస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని జిల్లా ఆడిట్ అధికారి జయశ్రీ తెలిపారు.
మహిళా సంఘాల సభ్యులు తెలిపిన ప్రకారం ఆర్ పి, మెప్మా సి ఓ లు సభ్యుల నుండి కొట్టేసిన డబ్బులలో వాటాలు పంచుకున్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. బ్యాంకు లావాదేవీలు పరిశీలించిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరసయ్య, ఆడిట్ సిబ్బంది,, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.