2 April, 2026 | 2:55 AM

ఎల్బీనగర్ జోనల్‌లో విజిలెన్స్ దాడులు

02-04-2026 01:20 AM

ఎల్బీనగర్, ఏప్రిల్ 1 : మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ లోని ఎల్బీనగర్ జోనల్ పరిధిలోని సర్కిల్ కార్యాలయాల్లో బుధవారం ఉదయం 11 గంటలకు స్టేట్ విజిలెన్స్, ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్ షికా గోయల్ ఆదేశాల మేరకు హైదరాబాద్ రూరల్ యూనిట్ ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో బృందం దాడులు నిర్వహించారు. సరూర్ నగర్ లోని సరూర్ నగర్ సర్కిల్ 12, ఎల్బీనగర్ సర్కిల్ 13, హయత్ నగర్ సర్కిల్ 14 కార్యాలయాల్లో దాడులు చేశారు. సాధారణ తనిఖీల్లో భాగంగా పలు రికార్డుల స్వాధీనం చేసుకుని పరిశీలించారు.

ఆయా సర్కిల్ ల్లోని అటెండెన్స్ రిజిస్టర్లను తనిఖీ చేశారు. బృందం దాడులు జరుపుతున్న సమయంలో అన్ని విభాగాల కార్యాలయాలలో దాదాపు అన్ని కుర్చీలు ఖాళీగా దర్శన మివ్వడంతో అధికారులు అవాక్కయ్యారు. అధికారులు ప్రతి ఒక్క ఫైల్ ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కార్యాలయంలో ఉన్న అధికారులతో మాట్లాడి వివరాలు తీసుకుంటు న్నారు. పలు కంప్యూటర్లలో డేటాను పరిశీలించారు. సోదాల అనంతరం అధికారులు మాట్లాడుతూ.. సాధారణ తనిఖీల్లో భాగంగానే రెవెన్యూ, శానిటేషన్, టౌన్ ప్లానింగ్, అకౌంట్స్ విభాగాలను తనఖీ చేశామని తెలిపారు. నివేదికను ఉన్నతాధికా రులకు అందజేస్తామని పేర్కొన్నారు.