calender_icon.png 2 November, 2025 | 8:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటితో ముగియనున్న విజిలెన్స్ వారోత్సవాలు

01-11-2025 04:48:34 PM

- సింగరేణిలో అవినీతిపై నైతిక యుద్ధం జరగాలి..?

- అడుగడుగునా అవినీతి ఆరోపణలు...

- ఇటు మెడికల్ బోర్డులో...

- అటు ట్రెడ్ యూనియన్ల లీడర్లలోనూ...  

- పైరవీలే అవినీతికి ఆజ్యం...

బెల్లంపల్లి అర్బన్: సింగరేణిలో నీతి నేతీబీరలో నెయ్యి చందంగా ఉంది. సింగరేణిలో అవినీతి నిర్మూలన హడావిడి విజిలెన్స్ వారోత్సవాల సందర్భంలోనే కనిపిస్తోంది తప్ప ఇతర సమయాల్లో ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే చందంగా ఉండిపోతుంది. ఈ మొక్కుబడి తంతు సింగరేణిలో అందరికీ తెలిసిన సంగతే... ముఖ్యంగా సింగరేణి విజిలెన్స్ విభాగం అధికారులకు ఈ సంగతి మరీ తెలుసు. అవినీతి నిర్మూలన, అందుకు మూల కారణాల నివారణపై, అధికారుల్లో చిత్తశుద్ధిపై కార్మికుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. నవంబర్ రెండవ తేదీతో ముగియనున్న విజిలెన్స్ వారోత్సవాలు ఎందరు అవినీతి పరులను మారుస్తుందో చూడాల్సిందే.

అవినీతికి ఆవాసాలు ఎన్నో..?

సింగరేణిలో అవినీతి ప్రతి రంగంలో తిష్ట వేసి రాజ్యమేలుతుంది. అనేక రూపాల్లో ఈ అవినీతి అక్రమాలు సింగరేణిలో గుట్టుచప్పుడుగా సాగుతుంది. ప్రతి రంగంలోనూ అవినీతి ఆశ్రిత పక్షపాతం వేల్లేసుకొని ఉందనడంలో సందేహం లేదు. ప్రతి విభాగం, రంగం అవినీతికి అతీతంగా లేని పరిస్థితులు సింగరేణిలో మాటువేసి ఉన్నాయి. సింగరేణిలో అవినీతి అక్రమాల నివారణ, వైఫల్యం ఒక్క విజిలెన్స్ యంత్రాంగం పని మాత్రమే కాదు. ఇందులో సర్వరంగాల భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుంది. విజిలెన్స్ అధికారుల విభాగం పరిధిలోనే అవినీతిని నిర్మూలించడం ఎప్పటికీ సరిపోదనే విషయాన్ని సింగరేణి యావత్ యజమాన్యం ఈ సందర్భంగా మననం చేసుకోవాల్సి ఉంటుంది. సింగరేణిలో అన్ని విభాగాల్లో అవినీతి, అక్రమాలు  కొనసాగుతున్నాయన్నది బహిరంగ రహస్యమే. ఇది ఎవరూ కాదనలేని సత్యం. సింగరేణిలో అవినీతి ఉన్నది కాబట్టే నిర్మూలం కోసం సింగరేణిలోప్రతియేటా విజిలెన్స్ వారోత్సవాల అవశ్యకత సింగరేణికి ఎంతో కీలకావసరమైంది.

- మెడికల్ బోర్డు అవినీతిగూడు?

సింగరేణిలో అవినీతి ప్రధాన ఆవాసం మెడికల్ బోర్డు అనే అభిప్రాయాలు సర్వత్రా ఉన్నాయి. మెడికల్ బోర్డులో అవినీతి గూడు కట్టుకున్న సంగతినీ  ఎవరూ కాదనలేరూ. ఉద్యోగ నియమకాలు మెడికల్ బోర్డు నిర్వహిస్తుంది. డిపెండెంట్ ఎంప్లాయిమెంట్, ఉద్యోగ నియామకాల కీలక బాధ్యత మెడికల్ బోర్డుదే. ఇక్కడ జగుతున్న అవినీతి మరెక్కడా లేదనే సంగతి జగమెరిగిన విషయమే. లక్షలాదిగా చేతులు మారుతాయి. సింగరేణిలో మిగిలిన అవినీతి రూపాలకు మెడికల్ బోర్డే కన్నతల్లి లాంటిది. అవినీతికి పెద్దన్న పాత్రలో మెడికల్ బోర్డు ఉందన్న అభిప్రాయాలు ప్రజల్లో బలంగా నాటుకుపోయి ఉన్నవి. ఇక్కడి నుంచే అవినీతిపై ప్రక్షాళన జరగాలి. మెడికల్ బోర్డు నుంచి అవినీతి నిర్మూలనకి నాంది పలకాలి. గతంలో మెడికల్ బోర్డు కేంద్రంగా అవినీతి అక్రమాలు పెట్రేగడంతో మొత్తంగా బోర్డు నిర్వహణ అధికారులనే మార్చివేశారు. అందుకు కారకులపై చర్యలు, సింగరేణిలో అవినీతికి ఇంతకంటే సాక్ష్యం మరోటిలేదు. ఈ చర్యలు అవినీతిని ప్రక్షాళన దిశగా అరికట్టలేకపోయాయి. దీంతో సింగరేణిలో  అవినీతి యధాతథం.

- మెడికల్ బోర్డు పైరవీకార్లు లీడర్లే..?

సింగరేణిలో మెడికల్ బోర్డులో జరుగుతోన్న ఉద్యోగాల నియామకాల్లో అవినీతి కార్మిక సంఘాల పెద్ద లీడర్లే కీలకం. వారి ప్రమేయం లేకుండా ఏ పని జరుగదన్నది కార్మిక లోకానికి విధితమే. ముఖ్యంగా వారసత్వ ఉద్యోగాలలో పైరవీలు లేకుండా ఉద్యోగాల నియామకాలు జరుగవన్న ఆరోపణలు ఉన్నాయి. కార్మికులు తమ పిల్లలకు ఉద్యోగాలు కల్పించుకోవడం కోసం రూ. 10 లక్షలు లంచంగా సమర్పించుకోవాల్సిందే. అలా సాదాసీదాగా వచ్చే వారసత్వ ఉద్యోగాలను లక్షలు అర్పించి కార్మికులు దక్కించుకోవాల్సిన దౌర్భాగ్యం సింగరేణిలో యదేచ్చగా జరుగుతోన్న భారీ అవినీతి. సింగరేణిలో మెడికల్ బోర్డులో జరుగుతోన్న అవినీతిలో అన్ని ప్రధాన యూనియన్ల పెద్ద లీడర్లు ప్రధాన వాటాదారులుగా మారిపోయారు. సామాన్యంగా జరిగిపోయే ఉద్యగ నియమాకలు సింగరేణిలో అటు మెడికబోర్డు అధికారులు ఇటు లీడర్ల కు కాసుల వర్షం కురిపిస్తున్నది. ఫలితంగా అంతికాలంలో మెడికల్ బోర్డు ఆఫీసర్లూ, పైరవీకార్లు కోట్లకు పడిగెత్తారు. అవినీతి రహిత సింగరేణి కోసం అవినీతి నిర్మూల కోసం సింగరేణిలో మహా నైతిక ఉద్యమం అవసరం.