18-01-2026 04:31:59 PM
మాస్ లైన్ సూర్యాపేట జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్
తుంగతుర్తి,(విజయక్రాంతి): తుంగతుర్తి మండలం తూర్పుగూడెం గ్రామంలో ఈరోజు సి.పి.ఐ(ఎం-ఎల్ )మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామ జనరల్ బాడీ సమావేశం సిపిఐ(ఎం.ఎల్) మాస్ లైన్ గ్రామ నాయకులు గుండగాని వెంకన్న అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఐ(ఎం.ఎల్) మాస్ లైన్ తుంగతుర్తి డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ పేర్ల నాగయ్య సమన్వయకర్తగా వ్యవహరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ సూర్యాపేట జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పాసిస్ట్ మతోన్మాద పరిపాలకులు ప్రజా సమస్యలను పట్టించుకోకపోగా, కులం పేరుతో మతం పేరుతో ప్రజల మధ్యన చిచ్చు పెడుతూ కలహాలను సృష్టిస్తున్నారని ఆరోపించారు.
సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ, వారి హక్కులను హరించే విధంగా పరిపాలన కొనసాగిస్తున్నారని అన్నారు. కార్మిక వర్గం కొట్లాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని హక్కును నాలుగు లేబర్ చట్టాలతో హరించివేసి పన్నెండు గంటల పని విధానాన్ని ప్రవేశపెట్టిన అతినీచ ఘన చరిత్ర బిజెపికి దక్కింది అన్నారు. దళారి పెట్టుబడిదారులకు,కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను దోచిపెట్టడంలో బిజెపి ప్రభుత్వం ముందుందని అన్నారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు ఆహార కొరత తీర్చేందుకు ఏర్పడిన మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ, చట్టాన్ని సవరిస్తూ, పేరు మారుస్తూ, గ్రామీణ వ్యవసాయ కూలీలను ఉపాధికి దూరం చేస్తున్నారని ఆరోపించారు.
అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ కార్డు ఇచ్చి, కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 200 పని దినాలు కల్పిస్తూ, రోజుకు కనీస వేతనం 700 రూపాయలు ఇవ్వాలని దేశవ్యాప్తంగా పేదలు ఆందోళన చేస్తుంటే, ఉన్న చట్టాన్ని నిర్వీర్యం చేయటం హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. నాలుగు లేబర్ కూడా చట్టాలను రద్దుచేసి, ఉపాధి హామీ చట్టం యధా విధంగా కొనసాగించేంతవరకు ఉద్యమాలను ఉదృతం చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించినారు.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో తూర్పు గూడెం గ్రామానికి చెందిన 12 కుటుంబాలు మడిపెద్ది లక్ష్మయ్య,, గుండగాని రాములు, గుండగాని శ్రీనివాస్, మనోహర్, గుండగాని హుస్సేన్, గుండ్ల వెంకన్న, గుండగాని మహేష్,మద్దెల బిక్షం,మరిపెద్ది నరసయ్య, కన్నెబోయిన ఐలయ్య, తాళ్లపల్లి చంద్రయ్య, గుండగాని యాకయ్య తదితరులు పార్టీలో చేరినారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కామ్రేడ్ కారింగుల వెంకన్న, సీనియర్ పాత్రికేయులు బైరబోయిన వెంకటేశ్వర్లు, నాయకులు గుండగాని వెంకన్న, చామల రమేష్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.