07-05-2025 10:37:17 PM
బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి..
రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు..
బాన్సువాడ (విజయక్రాంతి): బాన్సువాడ పట్టణంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి(MLA Pocharam Srinivas Reddy) అధ్యక్షతన బాన్సువాడ నియోజకవర్గ ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక కొరకై గ్రామ, వార్డు ఇందిరమ్మ కమిటీ సభ్యులు, సంబంధిత అధికారులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, బాన్సువాడ నియోజకవర్గంలోని అన్ని మండలాల ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
పోచారం మాట్లాడుతూ... సొంత ఇల్లు లేని నిరుపేదలకే ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఇంటిని మహిళల పేరు మీదే మంజూరు చేస్తారు. ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యుల ద్వారా పారదర్శకంగా ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల ఎంపిక ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో ఎటువంటి రాజకీయలకు జోక్యం లేకుండా చూడాలి. జాబితాలో పేరు లేని వారు నిరాశ చెందవద్దు, ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల రెండవ విడత ఎంపిక జరుగుతుంది, ఇది నిరంతర ప్రక్రియ ప్రతి గ్రామంలో అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు వచ్చేలా ఇందిరమ్మ కమిటీ సభ్యులు అందరూ కూర్చొని నిర్ణయించాలి.
అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు ఎంపిక చేస్తే కఠిన చర్యలు ఉంటాయని, ఒకటికి రెండు సార్లు పరిశీలించిన తరువాత ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారుల ఎంపిక జరగాలని పేర్కొన్నారు. గ్రామ, వార్డుసభల్లో ఆమోదం పొందిన తరవాతే లబ్ధిదారులను కలెక్టర్ ఎంపిక చేస్తారు. లబ్ధిదారుల జాబితాను జిల్లా కలెక్టర్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిని సంప్రదించి ఇంటిని మంజూరు చేస్తారు. 400 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణం చేపట్టాలి. కిచెన్, బాత్రూం ప్రత్యేకంగా ఉండాలి. ఆర్ సీసీ రూఫ్‌తో ఇంటిని నిర్మించాల్సి ఉంటుంది. బాన్సువాడ నియోజకవర్గం మొత్తానికి గాను 3514 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యాయి' అని పోచారం తెలిపారు.