22-10-2025 12:00:00 AM
పాఠశాలకు వెళ్లేందుకు సైకిల్ బహుకరణ
పాపన్నపేట, అక్టోబర్ 21 : పాపన్నపేట మండలం దౌలాపూర్ గ్రామస్తులు కలిసి ఓ నిరుపేద విద్యార్థికి సైకిల్ అందజేశారు. గ్రామానికి చెందిన చాకలి చందు అనే 8వ తరగతి విద్యార్థి ప్రతిరోజూ 4 కి.మీ (కుర్తివాడ ఉన్నత పాఠశాల) నడుచుకుంటూ వెళ్లడానికి ఇబ్బంది పడుతూ, తోటి విద్యార్థుల వలె తానూ సైకిల్ కొనాలనుకున్నా.. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంతే ఉండడంతో కలత చెందిన విద్యార్థినిని గమనించిన గ్రామస్థులు ఐకమత్యంతో ముందుకొచ్చి డబ్బు సమీకరించారు. ఆ డబ్బుతో సైకిల్ కొనుగోలు చేసి దీపావళి రోజు ఆ విద్యార్థికి అందజేసి ఆ ఇంట్లో దీపావళి వెలుగులు నింపారు.
గంటలో డబ్బులు జమ..
విద్యార్థికి సహాయం కోసం సుమారు 30 మంది ఒకే గంటలో దాదాపు రూ.6 వేలు జమచేసి ఆ వెంటనే సైకిల్ తీసుకువచ్చి అందజేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ.. ఐక్యమత్యంతో ఉంటే కొండంత సమస్య కూడా సులభంగా పరిష్కారం అవుతుందన్నారు.