29-06-2025 12:00:00 AM
విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్’ అనే వెబ్‌సిరీస్ ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం జీ5 స్ట్రీమ్ అవుతోంది. సోషల్ మీడియా ఫేమ్ అభిజ్ఞ వూతలూరు ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్‌కు పోలూరు కృష్ణ దర్శకత్వం వహించారు. సౌత్ ఇండియన్ స్క్రీన్స్ బ్యానర్‌పై శ్రీరామ్ ఈ సిరీస్‌ను నిర్మించారు. శనివారం ఈ సిరీస్ టీమ్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో జీ5 తెలుగు బిజినెస్ హెడ్ అనురాధ మాట్లాడుతూ..
‘నేను స్టేజ్ మీద ఎక్కువగా మాట్లాడను. జీ తెలుగు సంస్థకు ఇది 20వ వసంతం. మా టీమ్ సహకారం వల్లే ఇంత సక్సెస్‌ఫుల్‌గా సాగుతున్నాం. మేం వంద శాతం ఒరిజినల్ కంటెంట్, షోలను తీసుకు వచ్చాం. మేం ఎన్నో ఐకానిక్ షోలను చేశాం. మేం వేసిన బాటలో ఎంతో మంది నడిచారు. ఓ కాప్ స్టోరీ కావాలని నేనే దివ్యను అడిగాను. అప్పుడే దివ్య సొంతంగా ఈ కథను రాసుకున్నారు. జరిగిన వివాదం గురించి మేం మాట్లాడం.
మా సంస్థను కించపర్చేలా మాట్లాడిన వారిపై పరువునష్టం దావా వేశాం. న్యాయ వ్యవస్థపై మాకు నమ్మకం ఉంది. ఇంత నెగెటివిటీ ఉన్నా కూడా మా సిరీస్‌కు ఇంతటి రెస్పాన్స్ వచ్చింది. మేం ఎన్నో రికార్డులు క్రియేట్ చేస్తూ, హద్దుల్ని చెరిపి వేస్తూ వచ్చాం.. ఇంకా ఇలాంటి పాత్ బ్రేకింగ్ కంటెంట్‌తో వస్తూనే ఉంటాం” అన్నారు. నిర్మాత శ్రీరామ్ మాట్లాడుతూ.. “రెక్కీ’ తర్వాత ఎన్నో కథలు వింటే ‘విరాటపాలెం’ పాయింట్ నన్ను వెంటాడింది.
మా మాటలే కంటే మా విజయమే అన్నింటికీ సమాధానం చెబుతుంది” అని చెప్పారు. జీ5 తెలుగు వైస్ ప్రెసిడెంట్, కంటెంట్ హెడ్ దేశ్ రాజ్ మాట్లాడుతూ.. “కొత్త కంటెంట్‌ను మేం మాత్రమే క్రియేట్ చేయగలం.. ముందుకు తీసుకెళ్లగలం. మరిన్ని కొత్త ప్రాజెక్టుల్ని తీసుకువస్తున్నాం. ప్రతి నెలా ఓ మంచి వెబ్ సిరీస్‌తో వస్తాం. ప్రతి ప్రాజెక్ట్‌తో కొత్త నటీనటులు, టెక్నీషియన్లను తీసుకురాబోతోన్నాం.
విరాటపాలెం ఒక్క రోజులోనే రెక్కీ కంటే డబుల్ వ్యూస్‌ను సాధించింది” అని తెలిపారు. ఇంకా కార్యక్రమంలో జీ5 తెలుగు ప్రతినిధులు సంజయ్, లాయిడ్, స్క్రీన్ ప్లే రైటర్ విక్రమ్‌కుమార్, కథా రచయిత్రి దివ్య తేజస్వీ, కెమెరామెన్ మహేశ్, నటీనటులు సూర్యతేజ, కృష్ణతేజ, సతీశ్ పాల్గొన్నారు.