calender_icon.png 5 January, 2026 | 7:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటర్ల సంఖ్య 16,161

05-01-2026 12:36:45 AM

కేసముద్రం మున్సిపాలిటీలో 16 వార్డుల వారీగా విభజన 

నేడు అభ్యంతరాల స్వీకరణ

కేసముద్రం, జనవరి 4 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో నూతనంగా ఏర్పడ్డ కేసముద్రం మున్సిపాలిటీలో ఉన్న 16,161 ఓటర్లను ఓటర్లను16 వార్డులను ఏర్పాటు చేసి, వార్డుల వారిగా విభజించారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గురువారం సాయంత్రం మున్సిపల్ కమిషనర్ టీ. శ్రీనివాసరావు మున్సిపల్ కార్యాలయం వద్ద నోటీసు బోర్డుపై ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రదర్శించారు. వార్డులవారీగా ఓటర్ల వివరాలు ఇలా ఉన్నాయి.

1వ వార్డులో 977 ఓట్లు కేటాయించగా, 2లో 1,140, 3లో 945, 4లో 869,5లో 982, 6లో 944, 7లో 1,055, 8లో 993, 9లో 1,009, 10లో 900, 11లో 1,027, 12లో 1,095, 13లో 921, 14లో 920, 15లో 1,295, 16వ వార్డులో 1,089 ఓట్లను కేటాయించారు. కేసముద్రం మున్సిపాలిటీలో మొత్తం ఓట్లు 16,161 ఉండగా, పురుషులు 7,868, మహిళలు 8,293 ఉన్నారు. పురుషులతో పోలిస్తే మహిళల సంఖ్య అధికంగా ఉండడం విశేషంగా మారింది. ఇందులో కొన్ని వార్డుల్లో వెయ్యి మంది లోపు కేటాయించగా, మరికొన్ని వార్డుల్లో వెయ్యికి పైగా ఓట్లు కేటాయించారు. అతి తక్కువగా నాలుగవ వార్డులో 869 మంది ఓటర్లు ఉండగా, అత్యధికంగా 15వ వార్డులో 1,295 మంది ఓటర్లు ఉన్నారు. 

నేడు అభ్యంతరాల స్వీకరణ

కేసముద్రం మున్సిపాలిటీ ఎన్నికల కోసం ప్రదర్శించిన ముసాయిదా జాబితా ఓటర్ల నమోదు అంశంపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో నేడు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు మున్సిపాలిటీలో సమావేశం నిర్వహిస్తున్నట్లు కమిషనర్ టీ.శ్రీనివాసరావు తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కేసముద్రం మున్సిపాలిటీలో వార్డుల వారీగా ఓటర్ల విభజన నిర్వహించామని, అయితే రాజకీయ పార్టీల ప్రతినిధులు ఓటర్ల జాబితాపై ఇచ్చే అభ్యంతరాలను స్వీకరించి, వాటి పరిష్కారం దిశగా ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని చెప్పారు.

మున్సిపాలిటీ కార్యాలయం ముస్తాబు

కేసముద్రం మున్సిపాలిటీ కార్యాలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. గత ఏడాది కేసముద్రం స్టేషన్, కేసముద్రం విలేజ్, అమీనాపురం, ధనసరి, సబ్ స్టేషన్ తండా గ్రామాలను విలీనం చేసి కేసముద్రం నూతన మున్సిపాలిటీగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తాత్కాలికంగా కేసముద్రం స్టేషన్ పాత పంచాయతీ భవనంలో ప్రస్తుతం మున్సిపల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. దీనితో పాత పంచాయతీ కార్యాలయానికి కొత్తగా రంగులు వేయించి అందంగా తీర్చిదిద్దారు. కొత్తగా మునిసిపాలిటీ కార్యాలయ భవనం కోసం స్థలం కేటాయించి నిర్మించేంతవరకు ప్రస్తుతం ఇక్కడే కార్యకలాపాలను కొనసాగించడానికి నిర్ణయించారు.