5 May, 2026 | 4:11 AM

దీర్ఘకాలిక దగ్గు వెనుక ఆస్తమా దాగి ఉండొచ్చు

05-05-2026 02:40 AM

ఇంట్లోని గాలే శ్వాసకోశాలకు ముప్పు

కేర్ వైద్యుల హెచ్చరిక

ముందస్తు నిర్ధారణ, క్రమం తప్పని ఇన్‌హెల్లర్‌తో.. ఆస్తమాను నివారించవచ్చు

నేడు ప్రపంచ ఆస్తమా దినోత్సవం

హైదరాబాద్, మే 4 (విజయక్రాంతి): రెండు నుంచి మూడు వారాలకు మించి తగ్గని దగ్గు, ముఖ్యంగా రాత్రివేళల్లో లేదా తెల్లవారుజామున ఎక్కువయ్యే దగ్గు, అప్పుడప్పుడు ఊపిరి ఆడకపోవడం, ఛాతీలో బిగుతుగా అనిపించడం వంటి లక్షణాలను చాలామంది సాధారణ జలుబు,అలర్జీ లేదా సీజనల్ ఇన్ఫెక్షన్‌గా తీసుకుంటున్నారు.

అయితే ఇవి గుర్తిం చని ఆస్తమా లక్షణాలు కావొచ్చని కేర్ హాస్పిటల్స్ వైద్యులు హెచ్చరిస్తున్నారు.ప్రపంచ ఆస్తమా దినోత్సవం 2026 సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ, గాలి కాలుష్యం, నిర్మాణ పనుల ధూళి, వాహనాల ఉద్గారాలు, వాతావరణ మార్పులు, అలాగే ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ పెరగడం వల్ల ఆస్తమా, ఇతర శ్వాసకోశ వ్యాధులు క్రమంగా పెరుగుతున్నాయని తెలిపారు.

ఈ ఏడాది ప్రపంచ ఆస్తమా దినోత్సవ థీమ్ ప్రతి ఆస్తమా రోగికి యాంటీ- ఇన్‌ఫ్లమేటరీ ఇన్‌హెలర్లు అందుబాటులో ఉండటం ఇప్పటికీ అత్యవసరం అనే అంశంపై దృష్టి సారించింది. ముఖ్యంగా చిన్నపిల్లలతో సహా ప్రతి ఆస్తమా రోగికి ఇన్‌హెల్ కార్టికోస్టెరాయిడ్స్ అందుబాటులో ఉండాలని వైద్యులు పేర్కొన్నారు. ఇవి ఆస్తమా అటాక్స్‌ను గణనీయంగా తగ్గించడమే కాకుండా నివారించగల మరణాలను కూడా తగ్గిస్తాయని తెలిపారు. మలక్‌పేటలోని కేర్ హాస్పిటల్స్ సీనియర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ సుధీర్ ప్రసాద్ మాట్లాడుతూ, ఆస్తమా అటాక్స్ కేవలం రోగికే కాదు, వారి కుటుంబానికీ తీవ్ర ఇబ్బందులు కలిగిస్తాయి. ఇవి పిల్లల చదువులు, ఉద్యోగాలు, నిద్ర, రోజువారీ జీవనశైలిని దెబ్బతీస్తాయి.తీవ్రమైన సందర్భాల్లో అత్యవసర ఆసుపత్రి చేరిక లేదా మరణానికి కూడా దారితీయవచ్చు.

అయితే వీటిలో చాలావరకు ముందస్తు నిర్ధారణ, సరైన ఇన్‌హెల్లర్ చికిత్సతో పూర్తిగా నివారించవచ్చు, అన్నారు.ఆస్తమా ఎలా వస్తుందో వివరిస్తూ ఆయన, ఆస్తమా అటాక్ సమయంలో శ్వాసనాళాల కండరాలు బిగుసుకోవడం, వాపు రావడం, అధిక మ్యూకస్ పేరుకుపోవడం వల్ల గాలి మార్గాలు సన్నబడతాయి. దీంతో ఊపిరితిత్తులకు గాలి సరిగా చేరదు,శరీరానికి అవసరమైన ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది. అందుకే ఆస్తమా లక్షణాలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు, అని తెలిపారు. దీర్ఘకాలిక దగ్గు కూడా ఆస్తమా సంకేతమని చెబుతూ, ఆస్తమా అంటే కేవలం తీవ్రమైన ఊపిరి ఆడకపోవడమే అనుకుంటారు. కానీ కొందరిలో రాత్రిళ్లు ఎక్కువయ్యే తగ్గని దగ్గు ఒక్కటే లక్షణంగా కనిపించవచ్చు.

మా వద్దకు వచ్చే చాలామంది క్రానిక్ కఫ్ రోగుల్లో పరీక్షల అనంతరం ఆస్తమా నిర్ధారణ అవుతోంది, అన్నారు. ఇంట్లో గాలి నాణ్యతపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆయన, ఏసీలను ఎక్కువసేపు ఉపయోగించడం, గదుల్లో గాలి ప్రసరణ లేకపోవడం, దుమ్ము పేరుకుపోవడం, ఫంగస్, పెంపుడు జంతువుల వెంట్రుకలు, ఇంట్లో ఉం డే అలర్జీ కారకాలు,ఇవన్నీ కలిసి ఆస్తమా సమస్యను మరింత పెంచుతున్నాయి.  సీనియర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ సయ్యద్ అబ్దుల్ అలీమ్ మాట్లాడుతూ, ఆస్తమా ఎమర్జెన్సీలు పెరగడానికి ప్రధాన కారణాల్లో ఒకటి ఇన్‌హెల్లర్ వాడకంలో నిర్లక్ష్యం. చాలామంది లక్షణాలు తగ్గగానే ఇన్‌హెల్లర్  ఆపేస్తున్నారు.

కానీ ఆస్తమా దీర్ఘకాలిక ఇన్‌ఫ్లమేటరీ వ్యాధి. దీన్ని క్రమం తప్పకుండా నియంత్రణలో ఉంచాల్సిందే. మధ్యలో చికిత్స ఆపేస్తే తీవ్రమైన ఆస్తమా అటాక్స్ ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది, అన్నారు.వైద్యుల ప్రకారం వేసవి, ధూళి అధికంగా ఉండే కాలంలో, అలాగే సీజనల్, వర్షాకాల మార్పుల సమయంలో ఆస్తమా లక్షణాలు ఎక్కువగా ముదురుతాయి.ఈ సమయంలో గాల్లో అలర్జీ కారకాలు, తేమ మార్పులు, శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు పెరగడం ఇందుకు కారణమని తెలిపారు.