28-08-2025 01:42:40 PM
బిక్కుబిక్కుమంటున్న నవోదయ, ఆదర్శ పాఠశాలల విద్యార్థులు..
నిజాంసాగర్, (విజయక్రాంతి): కుండపోత వర్షాలతో ఎగువ నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరద పోటెత్తుతోంది. భారీ ఇన్ఫ్లో వస్తుండడంతో అధికారులు 27 వరద గేట్ల ద్వారా 2.20 లక్షల క్యూసెక్కుల నీటిని మంజీరలోకి విడుదల చేస్తున్నారు. కాగా.. వరద ఉధృతికి ప్రాజెక్టు దిగువ భాగంలో గల చిన్నపూల్ వంతెన కొట్టుకుపోయింది. నిజాంసాగర్ నుంచి నవోదయ పాఠశాలకు వెళ్లే వంతెన కొట్టుకుపోవడంతో నవోదయ, ఆదర్శ పాఠశాలల విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. నవోదయలో సుమారు 500 మంది విద్యార్థులు, ఆదర్శ పాఠశాల వసతి గృహంలో ఉన్న సుమారు 90 మంది విద్యార్థినులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. రెండు పాఠశాలల చుట్టూ వరదనీరు ప్రవహిస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు...