calender_icon.png 9 May, 2025 | 1:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా ప్రాజెక్టులకు నీళ్లివ్వండి!

08-05-2025 12:41:40 AM

  1. పాలమూరు, సమ్మక్క-సారక్క ప్రాజెక్టులకు వెంటనే కేటాయింపులు చేయండి
  2. ఏపీ కృష్ణా నీటి తరలింపును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం
  3. పోలవరం బ్యాక్‌వాటర్ ప్రభావం నుంచి రక్షణ చర్యలు తీసుకోండి
  4. సీడబ్ల్యూసీ చైర్మన్‌కు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వినతి
  5. ఎన్డీఎస్‌ఏ నివేదికపై అధ్యయనం చేస్తున్నాం..
  6. ప్రజాధనం వృథా కానివ్వబోమని వెల్లడి

హైదరాబాద్, మే 7 (విజయక్రాంతి): పాలమూరు ఎత్తిపోతల, సమ్మక్క -సారక్క బ్యారేజీలకు వెంటనే- నీటి కేటాయింపులు చేయాలని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ అతుల్‌జైన్‌తో ఆయన భేటీ అయ్యారు. అంతర్-రాష్ర్ట నీటి నిర్వహణ, మౌలిక సదుపాయాల భద్రతతో పాటు పోలవరం ప్రాజెక్టు నుంచి బ్యాక్‌వాటర్ ప్రభావం నుంచి రక్షణ చర్యలపైనా ఆయన అతుల్‌జైన్‌తో చర్చించారు.

కరువు పీడిత జిల్లాలైన మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వికారాబాద్, రంగారెడ్డి, నల్లగొండలో సు మారు 12.3లక్షల ఎకరాలకు సాగునీరు అం దించే లక్ష్యంతో 2015లో పాలమూరు ప్రా జెక్టు చేపట్టినట్లు తెలిపారు.

60 రోజుల వర ద కాలంలో కృష్ణా నది నుంచి రోజుకు 2 టీఎంసీ నీటిని ఎత్తిపోయడానికి 5 పంపింగ్ స్టేషన్ల ఏర్పాటుతో ఈ ఎత్తిపోతల పథకం పనులు సాగుతున్నాయన్నారు. ఇందుకోసం 90 టీఎంసీల నీటి కేటాయించాల న్నారు. మొదటిదశలో 45 టీఎంసీలను వెంటనే మంజూరు చేశారని..ఇక మిగిలిన కేటాయింపులు చేయాలని కోరారు. 

సమ్మక్క సారక్క బ్యారేజీకి కూడా..

జే చొక్కారావు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ పథకం, శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్ట్ (స్టేజ్ 1, 2) కింద దాదాపు 5.55 లక్షల హెక్టార్లకు నీటిపారుదలని స్థిరీకరించడానికి ములుగు జిల్లాలోని తుపాకులగూడెం వద్ద ఉన్న సమ్మక్క-సారక్క బ్యారేజీ, రూపొందించబడినట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. 6.94టీఎంసీల మొత్తం సామర్థ్యంతో నిర్మిం చే ఈ బ్యారేజీ పరిధిలో అనేక గ్రామాల తాగునీటి సమస్య తీరుతుందన్నారు.

ఇందుకు 44 టీఎంసీల కేటాయింపును వేగవంతం చేయాలని కోరారు. ఇందుకు అవసరమైన అన్ని డాక్యుమెంట్లను సమర్పించినట్లు తెలిపారు. కరువు నిర్మూలనతో పాటు సాగునీటికి ఈ రెండు ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు అత్యవసరమని మంత్రి పేర్కొన్నారు. 

టెలిమెట్రీ బిగించి నీటి దోపిడీ అపండి..

ఆంధ్రప్రదేశ్ కృష్ణానది నీటిని అక్రమం గా మళ్లించడంపై మంత్రి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నీటి దోపిడీని, అక్రమ మళ్లింపును అడ్డుకునేందుకు టెలిమెట్రీ పరికరాలు ఏర్పాటు చేయాలని సీడబ్ల్యూసీ చైర్మన్‌ను కోరారు. ఈ పరికరాలను ఏర్పాటు చేయడానికి తెలంగాణ ఇప్పటికే తన ఆర్థిక వాటాను కృష్ణా నది నిర్వహణ బోర్డుకు విడుదల చేసిందని స్పష్టం చేశారు. సీడబ్ల్యూసీ చైర్మన్ అతుల్‌జైన్ ప్రస్తుతం కేఆర్‌ఎంబీ,పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చైైర్మన్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నందున ఇది త్వరగా పూర్తిచేసేందుకు అవకాశం ఉందన్నారు.

పోలవరం ప్రాజెక్ట్ బ్యాక్‌వాటర్ ముప్పును కూడా చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ సరిహద్దు గ్రామాలపై బ్యాక్ వాటర్ ప్రభావాల తాజా అంచనాను చేపట్టాలని, వరద ముప్పును తప్పించేందుకు అవసరమైన రక్షణ చర్యలను సిఫార్సు చేయాలని కోరారు.

కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ (కేఎల్‌ఐఎస్)పై ఎన్డీఎస్‌ఏ ఇటీవల ఇచ్చిన నివేదికను మంత్రి సీడబ్ల్యూసీ చైైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. ఇది మొత్తం ప్రాజెక్ట్ నిర్మాణ, రూపకల్పనపై సందేహాలను లేవనెత్తిందన్నారు. మేడిగడ్డ మాత్రమే కాకుండా, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలోనూ లోపాలున్నాయన్నారు. ఎన్డీఎస్‌ఏ నివేదికపై అధ్యయనం చేస్తున్నామని ప్రజాధనం వృథా కానివ్వబోమని తెలిపారు.