calender_icon.png 15 October, 2025 | 5:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖమ్మంపల్లిలో నీటి గోస!

15-10-2025 12:39:36 AM

  1. పనిచేయని బోరు మోటర్లు గత పది రోజులుగా రాని నీరు 
  2. కానరాని స్పెషల్ ఆఫీసర్  పట్టించుకోని పంచాయతీ కార్యదర్శి 
  3. ఇబ్బందులు పడుతున్న ప్రజలు

మునిపల్లి, అక్టోబర్ 14 : అది పేరుకే ఖమ్మంపల్లి.. కానీ నీటి గోసకు తల్లి లాంటిదే .. అది ఎక్కడో కాదు మండల కేంద్రానికి కూత వేట దూరంలోనే ఉంది. ఆ గ్రామ పంచాయతీకి స్పెషల్ ఆఫీసర్ కూడా ఎమ్మార్వోనే. గ్రామాన్ని కన్నెత్తి కూడా చూడరు.. సందర్శించరు.. ప్రజా సమస్యలు పట్టించుకోరు.. ప్రభుత్వ అధికారుల సమన్వయ లోపంతో పల్లె వాసులకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు.

గత పది రోజులుగా తాగునీటికి గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతున్న ప్పటికీ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. దీని కారణం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్టగా మారింది. గ్రామంలోని మంచినీటి బోర్లకు మరమ్మతులు చేయకపోవడంతో ఈ దుస్థితి వచ్చిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామ పంచాయతీకి సంబంధించిన వాటర్ ట్యాంకర్ తో నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ నీళ్లు సరిపోక ఇబ్బందులు పడుతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయాన్ని గ్రామపంచాయతీ కార్యదర్శి శివకుమారి   దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. తమ నీటిగోసను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుండగా దసరా పండగ రోజు నీటి కోసం పడరాని పాట్లు పడ్డామని గ్రామస్తులు తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గ్రామంలో నెలకొన్న నీటి తిప్పలు తీర్చాలని గ్రామస్తులుకోరుతున్నారు. 

అధికారుల నిర్లక్ష్యం..

ఖమ్మంపల్లిలో అధికారుల నిర్లక్ష్యం వల్ల అన్నీ సమస్యలే ఏర్పడుతున్నాయి. గతంలో గ్రామంలో చెత్తచెదారం తీసుకెళ్ళక పోవడంతో గ్రామంలోనే పేరుకపోయి తీవ్ర దుర్గంధం వ్యాపించింది. ఈ విషయంలో విజయక్రాంతి పలుమార్లు కథనాలు ప్రచురించడంతో తేరుకున్న పంచాయతీ కార్యదర్శి ట్రాక్టర్ ద్వారా చెత్తను తొలగించారు. ట్రాక్టర్ డ్రైవర్ లేకపోవడంతోనే ఈ సమస్య ఏర్పడుతుందని అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉంది.

అలాగే వేసవిలో ఏర్పడాల్సిన తాగునీటి సమస్య కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇప్పుడే ఏర్పడింది. చెడిపోయిన మోటార్ను బాగు చేయించక పోవడంతో పది రోజులుగా గ్రామస్తులు తాగనీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారు. అయినా కూడా ప్రత్యేక అధికారి గానీ, కార్యదర్శి గానీ పట్టించుకున్న పాపానపోవడం లేదు. దీంతో గ్రామస్తులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

మరమ్మతుకు బడ్జెట్ లేదు..

గ్రామంలో మోటార్ చెడిపోవడంతో తాగునీటి ఇబ్బంది ఏర్పడుతుంది. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నాం. బడ్జెట్ లేనందునే కొత్త మోటార్ కొనుగోలు చేయలేక పోతున్నాం. ఏవరైనా మోటార్ ఇప్పిస్తే నీటి సమస్య తీరుతుంది. 

శివకుమారి, పంచాయతీ కార్యదర్శి