08-12-2025 01:42:26 AM
పులి పాదముద్రలే తప్ప
మచ్చుకైనా లేని మేక వన్నెలు !
దేశాలవి గాని, దేహాలవి గాని
సార్వభౌమత్వాలు అన్నీ కర్ర బలం కిందే
నలిగిపోతున్నాయి స్వేచ్ఛా స్వాంతనలు లేకుండా !
ఖనిజాలూ కలేజాలూ
కబాబ్ పుల్లలు అవుతున్నాయి !
వాతలతో, మచ్చలతో, అవిటితనం తో
ఆవిరవుతూ, అరిగిపోతూ,
సొమ్మగిల్లిపోతున్నారు !
జలపాత వందనాలు ఆర్పిస్తున్నారు
దుమికి దుమికి
పల్లం వైపు పారి పారి పొలాలకి చేరినట్లు
పాదాభివందనాలతో ప్రణమిల్లుతున్నారు !
వేయి వేయి నామాలు
వల్లించ లేక
పిలిస్తే పలికేవాడా, పలుకులవాడా అని పిలుస్తున్నారు !
అర్ధించి అర్ధించి సుక్కిపోతున్నారు
పలుకులవాడా, దీవెనల వాడా !
ఆటాడుకోనీయవు కానీ
ఆటాడుకుంటావు అని
అలసి అలసి ఆలోచనలే చేయలేకపోతున్నారు !
అరుదుగానైనా
ఆరోగ్య బిరుదులు ఎవరూ పొందడం లేదని
చెమటలు చిందించి
శ్రమ వీర బిరుదులు పొందినవారే
ప్రతీ విపత్తులో ప్రథమ మరణం పొందుతున్నారని
పొగిలి పొగిలిపోతున్నారు పలుకులవాడా దీవెనల వాడా !
శిశిర పత్రాల్లా
అవశేష అవమానాలోచనలు రాల్చుకొని
దివారాత్రులు ఆరాధనా జ్యోతులగా నేత్రాలను వెలిగిస్తున్నా
వేదనా గదుల తాళాలు
కాపలా మనిషి తెరవడం లేదని ఒకటే కంగారవుతున్నారు
పలుకుల వాడా, దీవెనల వాడా !
వాస్తవం
ఏకముఖి కాదని, బహుముఖియని
తెలివిడి తలల నిండా నింపి
అవధుల్లేని ఆవేదనలను అరికడతావని
మౌనంగా చేతులు జోడిస్తున్నారు
జలపాత వందనం గావిస్తున్నారు పలుకులవాడా !