08-12-2025 01:40:20 AM
ఆ ఇల్లును అలా
కురిసి తడవనివ్వండి
ఒకప్పటి మోసులెత్తి ఒక జీవన గీతమేదో
పూల నవ్వులతో పాడుకుంటుంది !
మోదుగు వనాల మధ్య
ఒకనాటి సాంస్కృతిక వారసత్వ
జీవన నినాదంలా శిథిలాల్లోంచి నిట్టనిలువునా
నిలబడి చరిత్రనేదో వల్లెవేయిస్తుంది
పెరట్లో గిలక బావి
ఎన్ని నాలుకలపై జీవన వాక్యం రాసిందో
ఎన్ని గొంతుల నాగరికతా గానమై రవళించిందో
వారగా పొన్నాయి చెట్టుకింద రోలుంది చూసారూ
తూరుపు గుట్టలు తొలిచి మా సోదరులు
తమ ఉలికళా నైపుణ్యంతో తొలిచి నల్లరాయి
ఎన్ని చెమట చుక్కలను
రాసిగా పోసి జానపదాలతో
దంపుడు పాటలనుకైగట్టిందో
****
మరెన్ని వేకువ కలలు చింది
చిరు మొక్కలకు ప్రాణం పోసిందో
కొన్ని తరాలను తన ఒడిలో సాకిన పురిటి వాసనేదో
మన చూపుల చుట్టూ బఠాణీ తీగలా అల్లుతుంది
పండగ పొద్దుల్లో కూడా పస్తులను
మౌన పావురమై తన రెక్కల కింద పొదువుకుందో
తిరగలి తన చుట్టూ తానే తిరుగుతూ
ఎన్ని కల్లం గింజల కన్నీటి పప్పుగా రాలిపడిందో
ఇప్పడా పాత ఇల్లు
కొత్త తరాలకు నడచివచ్చి పాదముద్రలను
కథలుగా చెప్పి నిద్రపుచ్చుతున్నది !