calender_icon.png 15 August, 2025 | 4:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల రక్షణకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నాం

15-08-2025 12:44:03 AM

కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల, ఆగస్టు 14 (విజయక్రాంతి) : వాతావరణ శాఖ సూచన మేరకు రాబోవు 2 రోజులలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజల రక్షణ కొరకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని మంచిర్యాల పట్టణంలోని తిలక్ నగర్ ప్రాంతంలో గల చెరువును డి.సి.పి. ఎగ్గడి భాస్కర్‌తో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో వరద పరిస్థితులను ఎదుర్కొనేందుకు, ప్రజల రక్షణ కొరకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని తెలిపారు. జిల్లాలోని కాజ్ వేలు, వాగులు, నదు ల వద్దకు ప్రజలు ఎవరు వెళ్లకుండా పోలీస్, రెవెన్యూ, పంచాయతీ శాఖల అధికారుల సమన్వయంతో బందోబస్తు ఏర్పాటు నిర్వహిస్తున్నామని, లోతట్టు, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను వరద పరిస్థితుల దృష్ట్యా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

జిల్లాలో వరదలకు సంబంధించి ఎలాంటి సమస్య వచ్చిన ఎదుర్కునేందుకు 90 మంది సభ్యులతో 3 ఎస్.డి.ఆర్.ఎఫ్. బృందాలు, జిల్లా అధికారులతో సిద్ధంగా ఉన్నామని, ప్రజల రక్షణకు కావలసిన పరికరాలు అందుబాటులో పెంచడం జరిగిందని, పోలీసు అధికారులకు శిక్షణ అందించడం జరిగిందని, గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచామని తెలిపారు.

ప్రభుత్వ సూచన మేరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళవద్దని, జిల్లాలోని పాఠశాలలకు గురువారం సెలవు ప్రకటించడం జరిగిందని తెలిపారు. ఉన్నతాధికారుల మార్గదర్శకాలను పాటిస్తూ ప్రజల రక్షణకు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీసీసీ నస్పూర్ ఎస్సై ఉపేందర్ రావు, ఎస్‌డిఆర్‌ఎఫ్ ఎస్సై అశోక్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.