calender_icon.png 10 January, 2026 | 4:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆధారాలు లేకుండా కేసును కొనసాగించలేం

10-01-2026 01:42:24 AM

  1. తెలంగాణ ఉన్నత న్యాయస్థానం
  2. నటుడు నవదీప్‌పై డ్రగ్ కేసు కొట్టివేసిన హైకోర్టు

హైదరాబాద్, జనవరి 9(విజయక్రాంతి): డ్రగ్స్ కేసులో నటుడు నవదీప్‌కు భారీ ఊరట లభించింది. ఆయనపై నమోదైన కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. గుడిమల్కాపూర్‌లో నమోదైన కేసులో నవదీప్ వద్ద ఎలాంటి డ్రగ్స్ స్వాధీనం కాలేదని, కేవలం ఎఫ్‌ఐఆర్‌లో పేరు చేర్చడమే తప్ప ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. నవదీప్ తరఫున న్యాయవాది వెంకట సిద్ధార్థ్ వినిపించిన వాదనలను పరిశీలించిన న్యాయస్థానం, కేవలం ఎఫ్‌ఐఆర్లో పేరు చేర్చడమే తప్ప సంఘటన జరిగిన ప్రదేశంలో, ఇతర ఆధారాల్లో గానీ డ్రగ్స్‌కు సంబంధించిన రుజువులు లేవని స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో కేసును కొట్టివేస్తున్నట్లు తెలంగాణ హైకోర్టు ప్రకటించింది. ఈ తీర్పుతో నవదీప్‌కు చట్టపరంగా పెద్ద ఊరట లభించింది. ఈ కేసు వెలుగులోకి వచ్చినప్పుడు నవదీప్ పేరు మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు వచ్చింది. హైదరాబాద్‌లో డ్రగ్స్ వినియోగం, సరఫరాకు సంబంధించిన విచార ణలో భాగంగా గుడిమల్కాపూర్‌లో జరిగిన ఒక ఆపరేషన్ సమయంలో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ క్రమంలో ఎఫ్‌ఐఆర్‌లో నవదీప్ పేరు చేర్చడంతో, అతను డ్రగ్స్ తీసుకుంటున్నాడన్న ఆరోపణలు, పరారీలో ఉన్నాడన్న కథనాలు సోషల్ మీడియా, టీవీ ఛానళ్లలో విస్తృతంగా ప్రచారం అయ్యాయి. ఈ వార్తలపై స్పందించిన నవదీప్, డ్రగ్స్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. తనను అనవసరంగా ఈ కేసులో ఇరికించారని, తాను ఎప్పుడూ డ్రగ్స్ వినియోగిం చలేదని వెల్లడించారు. పోలీసులు తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న భయంతో, ముందస్తు రక్షణ కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు, నవదీప్‌ని అరెస్ట్ చేయవద్దని తొలుత మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం కేసు వివరాలను పూర్తిగా పరిశీలించిన కోర్టు.. డ్రగ్స్ స్వాధీనం కాలేదన్న అంశాన్ని కీలకంగా పరిగణనలోకి తీసుకుంది.న్యాయవాది వెంకట సిద్ధార్థ్ వాదనల ప్రకారం, నవదీప్ పేరు కేవలం ఎఫ్‌ఐఆర్లో మాత్రమే ఉంది తప్ప, అతని వద్ద నుంచి ఎలాంటి నిషేధిత పదార్థాలు లభించలేదని, ప్రత్యక్ష ఆధారాలు లేవని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ వాదనలను సమగ్రంగా పరిశీలించిన న్యాయ స్థానం, కేసును కొనసాగించడానికి సరైన ఆధారాలు లేవని తేల్చి, డ్రగ్స్ కేసును పూర్తిగా కొట్టివేసింది.