16-08-2024 12:36:25 AM
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 15 (విజయక్రాంతి): వరంగల్ వేదికగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ తెలంగాణ రైతులకు ఇచ్చిన రూ.2 లక్షల రుణమాఫీ హామీని నెరవేర్చామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. గురువారం ఖమ్మం జిల్లా వైరాలో మూడో విడత రైతు రుణమాఫీ సందర్భంగా సాగుకు జీవం ఊతం పేరుతో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్ మాట్లాడారు. దేశంలోని 140 కోట్ల జనాభాకు స్వేచ్ఛను కల్పించిన కాంగ్రెస్ పార్టీ స్ఫూర్తిగా ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన 8 నెలల వ్యవధిలోనే రుణమాఫీ చేశామన్నారు.
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అడ్డా అని, జిల్లా రైతాంగానికి అండగా నిలుస్తామని చెప్పారు. 2026 ఆగస్టు 15 నాటికి సీతారామ ప్రాజెక్టును పూర్తిచేసి జిల్లాలోని 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుందని తెలిపారు. డబుల్ బెడ్రూం ఇళ్ల పేరుతో కేసీఆర్ మోసం చేశారని, తాము ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని స్పష్టం చేశారు.
రాష్ట్రం మొత్తం 4.5 లక్షల ఇళ్లు కట్టిస్తామన్నారు. ఆరు గ్యారెంటీల అమలుకు నిరంతరం కష్టపడుతున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు చూడలేక బీఆర్‌ఎస్ నాయకులు పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు 39 సీట్లు ఇస్తే పార్లమెంట్ ఎన్నికల నాటికి గుండుసున్నా ఇచ్చారన్నారు. ఏడు స్థానాల్లో డిపాజిట్ కూడా దక్కలేదని విమర్శించారు. తండ్రి కొడుకులు, బావ, బావమర్దులు ఇప్పటికైనా మారాలని హితవు పలికారు.
ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమా?: భట్టి విక్రమార్క
సాగునీటి ప్రాజెక్టులపై చర్చించడానికి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తాము సిద్ధంగా ఉన్నామని, సమయం, ప్రదేశం ఎక్కడో చెప్తే అక్కడికి వస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సవాల్ విసిరారు. చర్చకు రావడానికి మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు సిద్ధమేనా అని ప్రశ్నించారు. వైరా సభ వేదిక నుంచి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మొదలు పెట్టిన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయకుండా రీడిజైన్ పేరుతో బీఆర్‌ఎస్ పాలకులు దోపిడీకి పాల్పడ్డారని దుయ్యబట్టారు. ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలు ఇచ్చేందుకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్‌కు శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు.
2016లో దాదాపు పనులు పూర్తి కావొచ్చాయని కేవలం రూ.1,548 కోట్లు ఖర్చుచేస్తే ప్రాజెక్టు పూర్తి అయ్యేదన్నారు. కానీ ఖర్చును రూ.23 వేల కోట్లకు పెంచి, 8 వేల కోట్లు ఖర్చు చేసినా బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక్క ఎకరానికి కూడా పదేళ్ల కాలంలో నీళ్లు ఇవ్వలేక పోయిందని మండిపడ్డారు. రూ.38వేల కోట్లతో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పనులు మొదలు పెడితే రూ.10వేల కోట్లు కాంగ్రెస్ హయాంలో ఖర్చు చేశారన్నారు. కేవలం రూ.28 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుకు రూ.1.25లక్షల కోట్లు రీడిజైన్ పేరిట అంచనాలు పెంచి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజల సొమ్మును దోపిడీ చేసిందన్నారు. కేవలం రూ.30వేల కోట్లు ఖర్చు పెడితే రాష్ట్రంలో 21.50లక్షల ఎకరాలకు సాగునీరు వచ్చేదన్నారు. కేవలం కమీషన్లకోసం రీడిజైన్ల పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగంం చేసిందని గత ప్రభుత్వవంపై విరుచుకుపడ్డారు.
హరీశ్.. దమ్ముంటే రాజీనామా చెయ్
తాము చెప్పినట్లు రుణమాఫీ చేశామని, ఎన్నికల్లో సవాల్ విసిరిన సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆయన చెప్పిన ప్రకారం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని సీఎం రేవంత్ డిమాండ్ చేశారు. దమ్ముంటే ఇచ్చిన మాట మీద నిలబడాలని సవాల్ విసిరారు. లేని పక్షంలో అమరవీరుల స్థూపం వద్ద ముక్కు నేలకు రాసి కాంగ్రెస్ ప్రభుత్వంపై సవాలు విసిరినందుకు తెలంగాణ రైతులకు క్షమాపణ చెప్పాలని సీఎం డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తే ఎమ్యేల్యే పదవికి రాజీనామా చేస్తానని, ఇక ఎన్నికల్లో పోటీ చేయనని హరీశ్‌రావు సవాలు విసిరారు.
దానికి కట్టుబడి ఉండాలని సీఎం అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 25 రోజుల వ్యవధిలో రైతులకు రూ.18 వేల కోట్లు బ్యాంకులో వేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క స్థానం దక్కకున్నా బీఆర్‌ఎస్ నాయకులు వంకర మాటలు మాట్లాడుతున్నారని, ఆ పార్టీ బతుకు బస్టాండ్‌గా మారిందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు, కార్యకర్తలు, నాయకులు తనకు తోడుగా ఉంటే బీఆర్‌ఎస్ పార్టీని బంగాళాఖాతంలో కలుపుతానని స్పష్టంచేశారు.
రుణమాఫీ ఇలా..
రైతుల సంఖ్య రుణ మాఫీ మొత్తం
మొదటి విడత 11,50,000 రూ. 6098.93 కోట్లు
రెండో విడత 6,40,823 రూ. 6190.01 కోట్లు
మూడో విడత 4,46,832 రూ. 5,644.24 కోట్లు