18-11-2025 06:24:23 PM
కరీంనగర్ క్రైమ్ (విజయక్రాంతి): అనుమతులులేని నకిలీ కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోకపోవడంతో భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నాయని ఇలాంటి కోచింగ్ సెంటర్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో దాడులు తప్పవని ఉమ్మడి కరీంనగర్ జిల్లా జాతీయ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు సిరి శెట్టి రాజేష్ గౌడ్ హెచ్చరించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నాయకులతో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తమ భవిష్యత్తుపై బోలెడు ఆశలు పెట్టుకున్న విద్యార్థులను, పిల్లలను ప్రయోజకులను చేయాలనుకున్న తల్లిదండ్రులను నమ్మకం అనే పేరుతో నమ్మకద్రోహం చేస్తున్న కోచింగ్ సెంటర్లపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం జై ఈ ఈ ఫిజిక్స్ వంటి ఉత్తరాది విద్యా బ్రాండ్ల పేర్లను వాడుతూ, అనుమతులు లేకుండానే కరీంనగర్ జిల్లాలో కోచింగ్ సెంటర్లు నడుస్తున్నాయి అన్నారు. కోట్లలో వసూలు చేస్తున్న ఈ కోచింగ్ సెంటర్లు విద్యార్థులకు వాస్తవిక విద్యను అందించకుండా, పేరుకే బ్రాండ్ అని ప్రచారం చేస్తూ, అనేక కుటుంబాలను మోసగిస్తున్నాయి. ఉత్తరాది ప్రాంతాల్లో మోసపోయిన అనేక తల్లిదండ్రుల పరిస్థితిని చూస్తూ కూడా, ఇక్కడ మళ్లీ ఇదే తప్పు జరుగుతుండడం బాధాకరం. అనుమతులు లేకుండా నడుస్తున్న అన్ని కోచింగ్ సెంటర్లపై వెంటనే తనిఖీలు చేయాలి, విద్యాశాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, తల్లిదండ్రులు అబద్ధ ప్రకటనలను నమ్మకుండా, సరైన సమాచారంతో నిర్ణయాలు తీసుకోవాలనీ జాతీయ బీసీ విద్యార్థి సంఘం తరుపున డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆరిఫ్, అజయ్, ఆసిఫ్, శ్రీకాంత్ రమేష్ పాల్గొన్నారు.