18-11-2025 06:45:39 PM
వెంకటాపూర్ ఎస్సై చల్లా రాజు
మాదకద్రవ్యాల నివారణపై విద్యార్థులకు అవగాహన
వెంకటాపూర్(రామప్ప) (విజయక్రాంతి): మాదకద్రవ్యాల వలన విద్యార్థుల జీవితం నాశనమవుతుందని ఎస్సై చల్లా రాజు అన్నారు. మండలంలోని జవహర్ నగర్ ఆదర్శ పాఠశాలలో మంగళవారం వెంకటాపూర్ పోలీసుల ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక దుష్పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, అలాంటి వాటిని సేవించడం లేదా విక్రయించడం జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై చల్లా రాజు సూచించారు. పాఠశాల పరిసర ప్రాంతాల్లో ఎవరైనా తుంటరి చేష్టలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోలీసు సిబ్బందీలు పాల్గొన్నారు.