18-11-2025 06:40:59 PM
వెంకటాపూర్(రామప్ప) (విజయక్రాంతి): మండలంలోని ప్రపంచ ప్రఖ్యాత గాంచిన యునెస్కో వరల్డ్ హేరిటేజ్ సైట్ రామప్ప దేవాలయాన్ని సీఆర్పీఎఫ్ హైదరాబాద్ రేంజ్ డీఐజీ అనిల్ మింగే, కమాండెంట్ ప్రశాంత్ కె.ఆర్. శ్రీవాత్సవా మంగళవారం ప్రత్యేకంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు హరీష్ శర్మ, ఉమాశంకర్ లు వారికి కుంభ స్వాగతం పలికి శ్రీ రామలింగేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపించి స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు.
అనంతరం అధికారులు దేవాలయంలోని శిల్ప వైభవం, కట్టడ నిర్మాణ శైలి, నర్తకీ శిల్పాలు, ఇసుకరాయి నిర్మాణం వంటి విశిష్టతలను ఆసక్తిగా పరిశీలించారు. దేవాలయం దాదాపు 800 ఏళ్ల ప్రాచీనత కలిగి ఉందని టూరిజం గైడ్ వివరిస్తూ ఆలయ నిర్మాణ చరిత్రను వారికి వివరించారు. రామప్ప దేవాలయాన్ని “రాష్ట్ర గర్వకారణమైన వారసత్వ కట్టడం”గా అధికారులు అభివర్ణించారు. అనంతరం రామప్ప చెరువును సందర్శించి సరస్సు, ప్రకృతి అందాలను అశ్వాదించారు. వారి వెంట సీఆర్పీఎఫ్ అధికారులు, దేవాదాయ, పురావస్తు శాఖల సిబ్బందిలు, టూరిస్ట్ పోలిసులు ఉన్నారు.